తెలంగాణ

telangana

ETV Bharat / business

క్యూ2​లో జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతం - జీడీపీ వృద్ధి రేటు

Q2 GDP growth rate: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ 8.4 శాతం వృద్ధి చెందింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

september 2021 gdp growth rate
september 2021 gdp growth rate

By

Published : Nov 30, 2021, 5:51 PM IST

Updated : Dec 1, 2021, 7:19 AM IST

Q2 GDP rate of India 2021: ప్రధాన దేశాల్లో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో దేశ వృద్ధి రేటు అంచనాలకు మించి 8.4 శాతంగా నమోదు కావడం ఇందుకు దోహదం చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయం నాటి తక్కువ ప్రాతిపదిక ప్రభావం తగ్గినా.. కరోనా ముందు స్థాయిని ఆర్థిక వ్యవస్థ అధిగమించడం విశేషం. ప్రజలకు కొవిడ్‌ టీకాలు ఇవ్వడంలో గణనీయ ప్రగతి నమోదు కావడం, ప్రైవేటు వినియోగంలో వ్యయాలు పెరగడంతో ఇది సాధ్యమైంది. తక్కువ వడ్డీ రేట్లూ కలిసొచ్చాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో జీడీపీ వృద్ధి 20.1 శాతంగా నమోదవ్వడం గమనార్హం. మొత్తంమీద తొలి 6 నెలల్లో వృద్ధిరేటు 13.7 శాతంగా ఉంది. కొవిడ్‌ పరిణామాల వల్ల పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు కావడంతో 2020-21 ఏప్రిల్‌-జూన్‌లో 24.4 శాతం మేర; జులై-సెప్టెంబరులోనూ 7.4 శాతం మేర జీడీపీ క్షీణించినట్లు జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) తెలిపింది. 2021 జులై-సెప్టెంబరులో చైనా 4.9 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేయడం గమనార్హం.

విలువ పరంగా..కరోనా ముందు స్థాయికి ఆర్థిక వ్యవస్థ చేరింది. విలువ పరంగా చెప్పాలంటే.. 2021-22 జులై-సెప్టెంబరులో జీడీపీ రూ.35,73,451 కోట్లకు చేరింది. 2019-20 జులై-సెప్టెంబరులో నమోదైన రూ.35,61,530 కోట్ల కంటే ఇది ఎక్కువే. 2020-21జులై-సెప్టెంబరులో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ఈ విలువ రూ.32,96,718 కోట్లకు పరిమితమైంది.

ప్రథమార్ధంలో..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లో జీడీపీ (స్థిర ధరల వద్ద) రూ.68.11 లక్షల కోట్లకు చేరింది. 2020-21 ఇదే సమయం నాటి రూ.59.92 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 13.7 శాతం అధికం. 2020-21 ఇదే ఆరు నెలల్లో ఇది 15.9 శాతం తగ్గడం గమనార్హం.

తయారీలో 5.5% వృద్ధి

సెప్టెంబరు త్రైమాసికంలో తయారీ రంగంలో స్థూల విలువ జోడింపు(జీవీఏ) వృద్ధి 5.5 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం ఇది 1.5% క్షీణించడం గమనార్హం. వ్యవసాయ రంగ జీవీఏ వృద్ధి 3 శాతం నుంచి 4.5 శాతానికి వృద్ధి చెందింది. నిర్మాణ రంగంలో వృద్ధి -7.2% నుంచి 7.5 శాతానికి; గనుల రంగం -6.5% నుంచి 15.4 శాతానికి; విద్యుదుత్పత్తి, గ్యాస్‌, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల విభాగం 2.3% నుంచి 8.9శాతానికి; వాణిజ్యం, హోటళ్లు; రవాణా, కమ్యూనికేషన్‌, సేవలు -16.1% నుంచి 8.2 శాతానికి; ఆర్థిక, స్థిరాస్తి, వృత్తినైపుణ్య సేవలు -9.1 శాతం నుంచి 7.8 శాతానికి; ప్రభుత్వ పాలన, రక్షణ, ఇతర సేవలు -9.2% నుంచి 17.4 శాతానికి వృద్ధి చెందాయి.

ఈ ఏడాది రెండంకెల వృద్ధి: సీఈఏ

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ రెండంకెల స్థాయిని చేరుకుంటుంది. పెరుగుతున్న గిరాకీ, బలమైన బ్యాంకింగ్‌ రంగం ఇందుకు చేదోడుగా నిలుస్తాయి. తొలి అర్ధభాగంలో 13.7% వృద్ధిరేటు నమోదైంది. తదుపరి రెండు త్రైమాసికాల్లో వృద్ధిరేటు 6%పైన నమోదైనా, పూర్తి ఆర్థికానికి రెండంకెల వృద్ధి ఖాయమవుతుంది. 2022-23లో 6.5-7 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. రెండో తరం సంస్కరణల ఫలాలు ఈ దశాబ్దంలో భారత్‌ 7 శాతంపైన వృద్ధిరేటు నమోదు చేయడానికి సహకరిస్తాయి. ద్రవ్యలోటు కూడా బడ్జెట్‌ అంచనా(జీడీపీలో 6.8%)లోనే ఉండొచ్చు.

- కె.వి. సుబ్రమణియన్‌, ముఖ్య ఆర్థిక సలహాదారు

'వి' ఆకారపు రికవరీ రాలేదింకా..

తాజా గణాంకాలను జాగ్రత్తగా గమనించాలి. ‘వి’ ఆకారపు రికవరీ ఇంకా చోటు చేసుకోలేదు. ఆర్థిక వ్యవస్థలో కొన్ని రంగాలింకా ఇబ్బందుల్లోనే ఉన్నాయి. వాటి రికవరీకి సహాయం అవసరం.

- పి. చిదంబరం, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి

ద్రవ్యలోటు రూ.5.47 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు అక్టోబరు చివరికి రూ.5,47,026 కోట్లుగా నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో అంచనా వేసిన రూ.15.06 లక్షల కోట్లలో (జీడీపీలో 6.8%) ఇది 36.3 శాతమే. జీఎస్‌టీ వసూళ్లు సహా ప్రభుత్వ ఆదాయాలు పెరగడం ఇందుకు కారణం. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2021 అక్టోబరుకు ప్రభుత్వానికి రూ.12.79 లక్షల కోట్ల ఆదాయం (బడ్జెట్‌ అంచనాల్లో 64.8 శాతం) వచ్చింది. ఇందులో పన్నుల రూపేణా రూ.10.53 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం కింద రూ.2.06 లక్షల కోట్లు, నాన్‌ డెట్‌ కేపిటల్‌ రిసీట్స్‌ ద్వారా రూ.19,722 కోట్లు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మొత్తం వ్యయాలు రూ.18.26 లక్షల కోట్లుగా (బడ్జెట్‌ అంచనాలో 52.4 శాతం) నమోదయ్యాయి. ఇందులో రూ.15.73 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయాలు కాగా.. రూ.2.53 లక్షల కోట్లు మూలధన వ్యయాలని సీజీఏ వెల్లడించింది.

ఇదీ చదవండి:Elon Musk: భారతీయులపై మస్క్​ ప్రశంసలు

Last Updated : Dec 1, 2021, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details