యూపీఏ, ఎన్డీఏ హయాంలో భారత జీడీపీ వృద్ధి లెక్కలను వాస్తవానికన్నా ఎక్కువగా చూపించారని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. 2011-12, 2016-17 మధ్యకాలంలో జీడీపీ వృద్ధిని తప్పుగా లెక్కగట్టారని "ఇండియాస్ జీడీపీ మిస్ ఎస్టిమేషన్: లైక్లీ హుడ్, మ్యాగ్నిట్యూడ్, మెకానిజం, ఇంప్లికేషన్స్" పేరిట రూపొందించిన పరిశోధనా పత్రంలో వెల్లడించారు. జీడీపీ లెక్కింపు పద్ధతుల్లో ఉన్న తేడాల వల్లే అసలు కంటే 2.5 శాతం ఎక్కువగా అంచనా వేశారని పేర్కొన్నారు.
2011, 2016 మధ్యకాలంలో భారత వృద్ధి సరాసరి 4.5శాతంగా ఉందని, కానీ అధికారిక లెక్క మాత్రం 6.9 శాతమని వెల్లడించారు అరవింద్.‘2011 తరవాత జీడీపీ లెక్కింపు కోసం తీసుకువచ్చిన కొత్త పద్ధతులే అధిక అంచనాలకు కారణమనడానికి అనేక ఆధారాలున్నాయని ఆ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. భారత్ వేగవంతమైన వృద్ధి కోసం వాస్తవిక విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.