వారం రోజుల్లోనే 10.2 లక్షల మందికి రూ.4,250 కోట్ల ఆదాయపన్ను రిఫండ్ బదిలీ చేశామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. కొవిడ్-19 పరిస్థితుల్లో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడకూడదని వేగంగా ఈ ప్రక్రియ చేపట్టామని వెల్లడించింది.
ఈ వారం 1.75 లక్షల మందికి చెల్లింపులు..
పెండింగ్‌లో ఉన్న రూ.5 లక్షల్లోపు రిఫండ్లు వేగంగా చెల్లిస్తామని గతవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాదాపు 14 లక్షల మంది ప్రయోజనం పొందుతారని వివరించింది. చెప్పినట్టుగానే 10.2 లక్షల మందికి రూ.4,250 కోట్ల రిఫండ్ 2020, ఏప్రిల్ 14లోపు చెల్లించింది. ఈ వారంలో 1.75 లక్షల మందికి చెల్లింపులు చేస్తామని పేర్కొంది.
"పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ రిఫండ్ 5-7 రోజుల్లో జమ అవుతుంది. మరో 1.74 లక్షల మందికి రిఫండ్ గురించి ఈమెయిల్ పంపించాం. వారు స్పందించగానే ఏడు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం. పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసమే ఈ రిమైండర్లు. రిఫండ్ బదిలీ చేసేముందే చెల్లించాల్సిన మొత్తం, బ్యాంకు ఖాతాలను ధ్రువీకరించాలి" - సీబీడీటీ
ఇదీ చూడండి:కరోనా ప్రభావంతో విప్రో లాభాల్లో 6 శాతం క్షీణత