తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్​ కార్డులు ఇలా వాడితే.. మీ స్కోరు పదిలం! - క్రెడిట్​ స్కోరు ఎలా ఉంటే మేలు

ప్రస్తుతం ఎవరికైనా రుణం కావాలంటే.. క్రెడిట్ స్కోరునే బ్యాంకులు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. మరి క్రెడిట్ స్కోరు ఎంత ఉండాలి? మంచి క్రెడిట్​ స్కోరు అంటే ఎంత? స్కోరు పెరగాలంటే ఏం చేయాలి? ఈ సందేహాలన్నింటికి పూర్తి వివరణాత్మక కథనం.. మీ కోసం.

క్రెడిట్​ స్కోరు పెంచుకోండిలా..

By

Published : Nov 10, 2019, 6:01 AM IST

క్రెడిట్ స్కోరు అనేది ఒక వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణకు గుర్తు. అప్పులు ఇవ్వడం మొదలు.. ఉద్యోగ నియామకాల వరకూ ఇప్పుడిది కీలకంగా మారింది. మీ స్కోరు కనీసం 750 ఉంటే బాగున్నట్లే లెక్క. ఇప్పటి వరకూ మీకు ఏ రుణమూ లేకపోతే.. మీ క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్రను పెంచుకునేందుకు వెంటనే ఓ క్రెడిట్‌ కార్డును తీసుకోండి. డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా తప్పనిసరిగా మీరూ ఓ కార్డుదారుడు కావాలి. కానీ, రెండు వైపులా పదునున్న క్రెడిట్‌ కార్డును వాడేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి!

క్రెడిట్​కార్డు వాడటంలో ఇవి గుర్తుంచుకోండి...

  • తొలిసారిగా కార్డు వాడుతున్న వారు బిల్లులకు సంబంధించిన విషయాల్లో కచ్చితంగా ఉండాలి. మీపై నమ్మకం కలిగేలా ప్రవర్తిస్తేనే.. మీ క్రెడిట్‌ స్కోరు పెరగడానికి అవకాశం ఉంది.
  • ఇప్పటికే మీ వద్ద మూడు క్రెడిట్‌ కార్డుల కన్నా ఎక్కువున్నాయా? మళ్లీ కొత్త కార్డు తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే.. మీ చేజేతులా క్రెడిట్‌ స్కోరు తగ్గించుకోవడానికి కృషి చేస్తున్నారన్నమాట.
  • గరిష్ఠ పరిమితి ఇచ్చే కంపెనీ కార్డును మాత్రమే ఎంచుకోండి. మీరు అంత మొత్తం వినియోగించుకోకపోయినా.. ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల క్రెడిట్‌ స్కోరు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.
  • ఏళ్ల తరబడి వాడుతున్న దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. కార్డును రద్దు చేసుకోవాల్సిన అవసరం వస్తే.. కొత్తగా తీసుకున్న వాటిని మొదట వదిలించుకోండి.
  • ఒకటికి మించి కార్డులుంటే అన్ని కార్డులనూ వాడటానికి ప్రయత్నించండి. కొన్ని కార్డు కంపెనీలు మీరు ఆరు నెలలకు మించి వాడకుంటే.. మీరు కార్డును రద్దు చేసుకున్నట్లుగా భావిస్తాయి. ఇలాంటప్పుడు మీ క్రెడిట్‌ స్కోరు ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి.
  • కొత్తగా వచ్చిన క్రెడిట్‌ కార్డుకు క్రెడిట్‌ పరిమితి భారీగా ఉండి, పాత కార్డుకు తక్కువ మొత్తంలో ఉందనుకోండి... రెండింటిలో ఒకదానిని రద్దు చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు దేన్ని ఎంచుకోవాలి? ముందుగా మీ పాత క్రెడిట్‌ కార్డు బ్యాంకును సంప్రదించి మీ గురించి తెలియజేయండి. కొన్నేళ్లుగా ఎలాంటి ఆలస్యాలకు తావులేకుండా మీరు బిల్లులు చెల్లిస్తూ ఉంటే.. ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయండి. మీ కార్డు పరిమితిని పెంచాల్సిందిగా కోరండి. చాలా బ్యాంకులు ఈ విషయంలో సానుకూలంగా స్పందించే వీలుంది.
  • క్రెడిట్‌ కార్డు పరిమితి ఉంది కదా అని చెప్పి.. అదేపనిగా కార్డును వాడటం మంచిది కాదు. మీ కార్డు పరిమితిలో 40శాతానికి మించి వాడకపోవడమే మంచిది. దీనివల్ల క్రెడిట్‌ కార్డు స్కోరు పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
  • ఏడాదిలో ఒకసారి ఉచితంగా క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర పొందే అవకాశం ఉంది. దీనికోసం సిబిల్‌ వెబ్‌సైట్​ చూడొచ్చు.

ఇదీ చూడండి: రెడ్​మీ నోట్8, రియల్ మీ3 ప్రో ఏది బెస్ట్​?

ABOUT THE AUTHOR

...view details