ప్రస్తుత సమయంలో రుణ రహిత జీవితాన్ని గడపడం చాలా వరకు అసాధ్యం అనే చెప్పాలి. క్రెడిట్ కార్డు, ఇల్లు, కారు ఇలా ఏదో ఒక రుణ సదుపాయాన్ని వినియోగించుకోవడం ఇప్పుడు సాధారణ అంశం. రుణ భారాన్ని ఉన్న ఫళంగా తగ్గించుకోవడం కష్టమే అయినా... ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తే మాత్రం అప్పుల నుంచి ఉపశమనం లభించడం కాస్త సులువే. అలా ప్రాక్టికల్‌గా ప్రాచుర్యం పొందిన పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డెట్ స్నోబాల్ పద్ధతి
చిన్న రుణాల చెల్లింపుతో ప్రారంభమై.. పెద్ద రుణాలు పూర్తి చేయడమే ఈ పద్ధతి చెప్పే తొలి సూత్రం.
సాధారణంగా.. అందరూ ముందు పెద్ద రుణాలను పూర్తి చేసి తర్వాత చిన్న రుణాలను తీరుద్దామనుకుంటారు. అయితే రుణాల సంఖ్యను తగ్గించడానికి మొదట చిన్న రుణాలను పూర్తి చేయాలని డెట్ స్నోబాల్ పద్ధతి చెబుతోంది.
ప్రణాళిక ఇలా...
- మీరు తీసుకున్న అన్ని రుణాలను.. చిన్న రుణాల నుంచి పెద్ద రుణాల జాబితాను సిద్ధం చేసుకోవాలి.
- మొదట చిన్న రుణాలకు తప్ప మిగతా అన్నింటికీ కనీస చెల్లింపులు చేస్తుండాలి.
- మీకు వచ్చే క్రమమైన ఆదాయంతో పాటు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చే ఆదాయన్నీ చిన్న రుణాల చెల్లింపునకే వెచ్చించాలి.
- ఇలా ఒక రుణం పూర్తయిన తర్వాత.. వాటి మొత్తాలను తర్వతి చిన్న రుణాలకు కేటాయిస్తూ వెళ్లాలి.
ఉదాహరణ
మీకు రెండు క్రెడిట్ కార్డులు ఉన్నాయనుకుందాం. వాటిలో మొదటి కార్డు ఔట్ స్టాండింగ్ రూ. 25,000, రెండో కార్డు ఔట్‌స్టాండింగ్ రూ. 50,000 అనుకుంటే... మొదటి కార్డుకు నెలకు 18 శాతం (రూ. 1,250), రెండో కార్డుకు 24 శాతం వడ్డీ (రూ. 2,500) చొప్పున చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.