తెలంగాణ

telangana

ETV Bharat / business

హోం ఇన్సూరెన్స్​ తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి.. - గృహ బీమా ఉపయోగాలు

ప్రకృతి విపత్తులతో ఇల్లు కూలిపోతే.. దాని వల్ల ఏర్పడే ఆర్థిక నష్టాన్ని తగ్గించుకునేందుకు గృహ బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ బీమా ఇంటికి మాత్రమే తీసుకుంటే.. ఇంట్లో ఉంటే విలువైన వస్తువులకు రక్షణ లభించదు. మరి ఇంటితో పాటు ఇంట్లోని సామాగ్రికి కలిపి సమగ్ర బీమాను ఎంపిక చేసుకోవడం ఎలా? అనే వివరాలు మీకోసం.

Best Home Insurance Policy
గృహ బీమా విషయంలో జాగ్రత్తలు

By

Published : Aug 21, 2021, 11:10 AM IST

ఇటీవలి కాలంలో వరదలు, తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు.. తీవ్ర ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో ఇవి ఇంకా పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవిత కాలం శ్రమించి కట్టుకున్న ఇళ్లకు వీటి వల్ల భారీ నష్టం జరుగుతుంది. ఇంట్లోని సామాగ్రి కూడా పాడైపోతోంది.

కొన్ని సందర్భాల్లో ఇంటికి తక్కువ నష్టం కలగవచ్చు. కానీ ఇంట్లో ఉన్న ఫర్నీచర్, విద్యుత్ సామాగ్రి, ఇతర విలువైన సామాన్లు పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం సంభవిస్తే ఆర్థిక భారం పడకుండా గృహ బీమా తీసుకోవచ్చు. అయితే కేవలం ఇంటికి మాత్రమే బీమా తీసుకోవటం వల్ల ఇంట్లోని సామాగ్రికి బీమా వర్తించదు. ఇంటితో పాటు ఇంట్లోని వస్తువులు, సామాగ్రికి వర్తించే విధంగా పాలసీ ఉండాలి. అలా ఇంటితో పాటు ఇంట్లోని అన్ని వస్తువులకు వర్తించే పాలసీ ఎంపిక ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

గృహ బీమా వేటికి?

గృహ బీమాలు సాధారణంగా ఏక మొత్తం ప్రీమియం పాలసీలే. ఇంటితో పాటు ఫర్నీచర్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర విలువైన సామాగ్రికి కలిపి బీమా తీసుకోవచ్చు. బీమా ఉన్నట్లయితే.. అగ్ని ప్రమాదాలు, తుపాను, వరదల వంటి వాటి వల్ల నష్టం జరిగినప్పుడు ఇంటి పునరుద్ధరణకు అయ్యే ఖర్చుల భారం యజమానిపై పడదు. దోపిడీ వల్ల జరిగే నష్టాల నుంచి తప్పించుకునేందుకు కూడా బీమా తీసుకోవచ్చు.

గృహ బీమా ఉన్నట్లయితే.. సహజ, మానవ తప్పిదాల వల్ల జరిగిన నష్టానికి అయ్యే ఖర్చును బీమా సంస్థలు చెల్లిస్తాయి. పెద్ద డ్యామేజీలకు మాత్రమే కాకుండా చిన్న చిన్న రిపేర్లకు కూడా కూడా బీమా సదుపాయం వినియోగించుకోవచ్చు. గాలి, తుఫాను వల్ల ఇంటికి ఏదైనా నష్టం జరిగితే.. రిపేరుకు కావాల్సిన మొత్తాన్ని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. భారీ వర్షాల వల్ల పైకప్పు నుంచి లీక్‌ అయినప్పుడు కూడా రిపేర్​కోసం క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

దాదాపు అన్ని బ్యాంకులు గృహ బీమాను అందిస్తున్నాయి. గృహ బీమాలో వివిధ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా పాలసీ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని అవసరానికి తగ్గ పాలసీని తీసుకోవాలి.

ఇంట్లో వస్తువులకు వర్తించేలా సమగ్ర బీమా..

గృహ బీమాలో పలు రకాలు ఉన్నాయి. 'సమగ్ర బీమా' ద్వారా ఇంటితో పాటు ఇంట్లోని వస్తువులకు కూడా కవరేజీ లభిస్తుంది. నగలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, ఫర్నీచర్‌, ఇతర విలువైన వస్తువులకు నష్టం వాటిల్లినా.. ఈ పాలసీని క్లెయిమ్ చేసుకోవచ్చు. పరికరాలు, ఫర్నీచర్‌, నగలు, బీరువాలు తదితర అవసరమైన వస్తువులకు బీమా అందించే విధంగా హౌజ్‌హోల్డ్‌ ఆర్టికల్స్‌ బీమా తీసుకోవచ్చు.

ఇంట్లోని వస్తువులకు కాకుండా కేవలం ఇంటికి లేదా అపార్ట్​మెంట్​కు కవరేజీ ఇచ్చేందుకు పాలసీలు కూడా ఉన్నాయి. కార్యాలయాలు, దుకాణాల లాంటి వాణిజ్య సముదాయాల కోసం ప్రత్యేక పాలసీలు ఉన్నాయి. గృహ బీమాకు యాడ్​ఆన్​లను తీసుకోవచ్చు. వీటి ద్వారా అద్దె నష్టపోవటం, తాత్కాలికంగా నివాసం, పెంపుడు జంతువులకు తదితరాలపై కవరేజీ పొందవచ్చు.

వేటికి కవరేజీ?

కొన్ని సంఘటనల విషయంలో బీమా సంస్థలు కవరేజీ ఇవ్వవు. యుద్ధాలు, అణు యుద్ధాలు ఈ కోవలోకి వస్తాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే బీమా క్లెయిమ్​ను కంపెనీలు తిరస్కరించవచ్చు. నిర్మాణంలో ఉన్న వాటికి కూడా కవరేజీ ఉండదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details