తెలంగాణ

telangana

ETV Bharat / business

కేంద్రం-రాష్ట్రాల మధ్య వీడని 'జీఎస్​టీ' ప్రతిష్టంభన - gst council meet

జీఎస్​టీ పరిహారంపై కేంద్రం-రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభనకు తెరపడేలా కనిపించటం లేదు. ఈ అంశంపై మూడోసారి జరిగిన జీఎస్​టీ మండలి సమావేశంలోనూ కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. మండలి భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​.. రుణాల స్వీకరణ ద్వారానే నష్టాన్ని భర్తీ చేసుకోవాలని సూచించారు.

fm
నిర్మలా సీతారామన్

By

Published : Oct 12, 2020, 10:59 PM IST

Updated : Oct 13, 2020, 6:37 AM IST

కొవిడ్‌ కారణంగా రాష్ట్రాలకు తగ్గిన పన్ను ఆదాయలోటును భర్తీ చేయడానికి.. కేంద్రం రుణం తీసుకోవడం సాధ్యం కాదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది రూ.7.8 లక్షల కోట్లకు బదులు రూ.12 లక్షల కోట్ల రుణం తీసుకోవడానికి సిద్ధమైందన్నారు. ఇంతకు మించి రుణానికి వెళ్తే.. ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ భారం పెరిగి, మొత్తం ఆర్థికవ్యవస్థ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రైవేటు సెక్టార్‌ మార్కెట్ల నుంచి సేకరించే రుణాలపై వడ్డీలు భారీగా పెరుగుతాయన్నారు. అందుకే రాష్ట్రాలే రుణాలు తీసుకోవాలని, ఆ మొత్తాన్ని 2022 తర్వాత కొనసాగించే జీఎస్‌టీ పరిహార సుంకంనుంచి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ 42వ సమావేశం కొనసాగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. పరిహారంపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు.

సాధ్యం కాదని చెప్పాం

''కేంద్రం ప్రతిపాదించిన మొదటి ఆప్షన్‌కు 21 రాష్ట్రాలు అంగీకరించాయి. మిగతా రాష్ట్రాలు మాత్రం కేంద్రమే రుణాలు తీసుకొని తమకు పరిహారం చెల్లించాలని అడిగాయి. అది సాధ్యంకాదని స్పష్టం చేశాం. ఇప్పటికే రుణ సేకరణ క్యాలెండరును విడుదల చేశాం. అందుకు అతీతంగా వెళ్తే తక్షణం వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. ఒకసారి కేంద్రం తీసుకున్న రుణాలపై వడ్డీ బెంచ్‌ మార్క్‌గా ఏర్పడితే, ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే అన్ని రుణాలపై వడ్డీలు భారీగా పెరిగిపోతాయి. జీ-సెక్‌ వడ్డీ పెరిగితే ప్రైవేటు రుణాలపై వడ్డీలు కూడా పెరుగుతాయి. ఇలాంటి తరుణంలో అధిక వడ్డీకి రుణాలు తీసుకొని పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురారు. అందుకే, కేంద్రానికి బదులు రాష్ట్రాలే రుణాలు తీసుకోవాలని చెప్పాం. రాష్ట్రాలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వమే చేయూత అందిస్తుందని హామీ ఇచ్చాం. ఎక్కువ వడ్డీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా సాయం చేస్తామని చెప్పాం. ఇప్పటికే ఆప్షన్‌-1ను ఎంచుకున్న రాష్ట్రాలు తాము ఎప్పటిలోగా రుణాలు తీసుకోవచ్చని అడిగాయి. ఏ ఆప్షన్‌నూ ఎంచుకోని రాష్ట్రాలు ఏకాభిప్రాయ సాధన ద్వారా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. అయితే.. దీనిపై ఏకాభిప్రాయం రాలేదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య యుద్ధమేమీ లేదు. చాలా చర్చలు జరిగాయి. ఏకాభిప్రాయం లేనంత మాత్రాన విభేదాలున్నట్టు కాదు. ఈ అంశంపై రాష్ట్రాలు కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందన్న ప్రశ్నలకు సమాధానం చెప్పను. తక్షణం డబ్బు కావాలని కోరుకుంటున్న రాష్ట్రాలకు త్వరలో ఏదో ఒక నిర్ణయం చెబుతాం. ఇప్పటికే సెస్‌ గడువును 2022 జులై నాటికి పొడిగించినందున.. ఎవరైనా రుణం తీసుకోవడానికి ముందుకొస్తే, ఆ రాష్ట్రాలకు చేయూతనందిస్తాం’’ అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

లక్ష్మణరేఖ దాటడం శ్రేయస్కరం కాదు..

కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక లోటు లక్ష్మణరేఖ దాటడం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ''15వ ఆర్థిక సంఘం గత ఏడాది అవార్డు ప్రకటించినప్పుడు కొవిడ్‌ పరిస్థితులు లేవు. కేంద్ర ప్రభుత్వం ఏయే పద్దు కింద రాష్ట్రాలకు ఎంత మొత్తం ఇవ్వాలన్నది ఆర్థిక సంఘం చెప్పింది. కొవిడ్‌ వల్ల కేంద్ర ఆదాయాలు పడిపోయినా, రాష్ట్రాలకిచ్చే ఆ నిధులకు ఢోకా రానివ్వలేదు. కేంద్రం ఆ బాధ్యతలను తూచా తప్పకుండా నిర్వర్తిస్తోంది. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నందున వాటిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ఏడాది రూ.7.8 లక్షల కోట్లకు బదులు రూ.12 లక్షల కోట్ల అప్పుతెచ్చి రాష్ట్రాలకూ ఆర్థిక సాయం చేస్తున్నాం. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో గత ఏడాదికంటే ఎక్కువే అప్పు తెచ్చాం. ఇంతకుమించి కేంద్ర ఆర్థికలోటు పెరగడం ఏమాత్రం మంచిదికాదు. కేంద్రం తీసుకొనే అదనపు రుణాల ప్రభావం అందరిపై తీవ్రంగా పడుతుంది'' అని ఆయన పేర్కొన్నారు.

Last Updated : Oct 13, 2020, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details