ఈ ఏడాది మార్చి నుంచి దేశీయ ఎగుమతులు ప్రతి నెలా 30 బిలియన్ డాలర్లుకు మించి నమోదవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇదో చెప్పుకోదగిన విశేషం. మరి ఇంతలా ఎగుమతులు జరుగుతున్నప్పుడు వాణిజ్యలోటు దిగిరావాలి కదా. అలా జరగకపోగా ఏడాదిక్రితంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. ఇందుకు కారణం పసిడి.. చమురు.. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు. ఈ మూడింటి దిగుమతులు అధిక స్థాయిల్లో కొనసాగుతుండటం.. వాణిజ్యలోటు నియంత్రణకు ప్రతిబంధకంగా మారింది. అయితే.. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లోని తొలి అర్థభాగంతో పోలిస్తే 2021-22 తొలి అర్థభాగంలో వాణిజ్యలోటు తక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయం. అంతేకాదు.. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనడానికి ఇదో నిదర్శనం. యంత్రాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులూ పెరుగుతుండటం పారిశ్రామిక కార్యకలాపాల్లో పురోగతికి సంకేతం.
పెట్రోలియమ్, ముడి చమురు ఉత్పత్తులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- సెప్టెంబరులో పెట్రోలియం, ముడి చమురు ఉత్పత్తుల దిగుమతులు 73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏడాదిక్రితం ఇదే కాలంలో ఇవి 32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే రెట్టింపునకు పైగా పెరిగాయన్నమాట. అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ దిగుమతులు ఇలాగే అధిక స్థాయిలో కొనసాగితే దేశీయ దిగుమతుల బిల్లు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికీ ఇబ్బందిని తెచ్చిపెట్టవచ్చు.
పసిడి
ఏప్రిల్- సెప్టెంబరులో పసిడి దిగుమతులు ఏడాదిక్రితంతో (6.8 బిలియన్ డాలర్లు) పోలిస్తే దాదాపు 4 రెట్లు పెరిగి 24 బిలియన్ డాలర్లకు చేరాయి. పండగ సీజను దృష్టిలో పెట్టుకుని జులై-సెప్టెంబరులో ముందస్తుగా అధికంగా దిగుమతి చేసుకున్నారని, డిసెంబరు త్రైమాసికంలో అంత ఉండకపోవచ్చనే అంచనాలున్నాయి.
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల దిగుమతులు 39 శాతం పెరిగి 32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కొవిడ్-19 రెండో దశ కారణంగా ఆరంభంలో దిగుమతులు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. జూన్ నుంచి స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. వినియోగదారు విశ్వాసం, కొనుగోలు శక్తి తిరిగి కొవిడ్-19 మునుపటి స్థాయికి చేరడమే ఇందుకు కారణం.