తెలంగాణ

telangana

By

Published : May 20, 2020, 12:30 PM IST

ETV Bharat / business

భారత్​ నుంచి 1600 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి

కరోనాతో ఆర్థిక మాంద్యం ఆందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో ఆసియా దేశాల నుంచి 26 బిలియన్​ డాలర్లు విలువైన విదేశీ పెట్టుబడులు వెనక్కి మరలినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అందులో ఒక్క భారత్​ నుంచే 16 బిలియన్​ డాలర్లు ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.

Foreign investors
భారత్​ నుంచి 16 బిలియన్​ డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి

కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఆర్థిక మాంద్యం భయాలతో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇటీవల ఆసియా దేశాల నుంచి మొత్తం 26 బిలియన్​ డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లాయని తెలిపింది. ఇందులో ఒక్క భారత్​ నుంచే 16 బిలియన్​ డాలర్లు ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేసింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొవిడ్​-19 ప్రభావాన్ని అంచనా వేస్తూ ఈ నివేదిక రూపొందించింది అమెరికాకు చెందిన కాంగ్రెషనల్​ పరిశోధన కేంద్రం(సీఆర్​ఎస్​).

ఐరోపాపై తీవ్ర ప్రభావం..

ఐరోపాలోని జర్మనీ, ఫ్రాన్స్​, బ్రిటన్​, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో 3 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది నివేదిక. యూరోజోన్​ ఆర్థిక రంగం తొలి త్రైమాసికంలో 3.8 శాతం తగ్గిపోయిందని.. 1995 తర్వాత ఓ త్రైమాసికంలో ఇదే అతిపెద్ద క్షీణత అని పేర్కొంది.

అమెరికాపై..

అగ్రరాజ్యంలో కరోనా తీవ్ర రూపం దాల్చటం వల్ల 2020 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 4.8 శాతం మేర తగ్గినట్లు వెల్లడించింది. ఆర్థిక సంక్షోభం నెలకొన్న 2008లో నాలుగో త్రైమాసికం అనంతరం అమెరికాలో ఇదే అతిపెద్ద త్రైమాసిక క్షీణతగా పేర్కొంది.

మూడు దేశాలపై తక్కువే..

కరోనాతో దాదాపు అగ్రదేశాలన్నింటి ఆర్థిక వ్యవస్థలు గణనీయంగా క్షీణించాయని, కేవలం చైనా, భారత్​, ఇండోనేషయా దేశాల ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం తక్కువగా ఉన్నట్లు నివేదించింది సీఆర్​ఎస్​. కానీ, 2020లో ఆర్థిక వృద్ధి సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details