సాధారణంగా మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడే మొత్తం అత్యవసర నిధి కోసం అందుబాటులో ఉండాలని నిపుణులు చెబుతుంటారు. మహమ్మారి నేపథ్యంలో ఇప్పుడు ఇది కనీస మొత్తమే. గరిష్ఠంగా మీ వీలును బట్టి, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.
- కుటుంబంలో ఒకరే ఆర్జిస్తుంటే.. ఈ అత్యవసర నిధి కనీసం 12 నెలల ఖర్చులకు సరిపడా ఉండాలి. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే.. కాస్త తక్కువగా ఉన్నా ఇబ్బంది ఉండకపోవచ్చు.
- గత కొంతకాలంగా ఏదైనా పెద్ద ఖర్చులు వచ్చాయా, మరోసారి అలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉందా లాంటివీ ఒకసారి ఆలోచించుకోండి. ఇలా అనుకోని ఖర్చులకూ ఇప్పుడు సిద్ధంగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఇప్పుడంతా ఆరోగ్య అత్యవసర పరిస్థితి. ఇంట్లో ఉండి, చికిత్స తీసుకున్నా.. వేల రూపాయల ఖర్చు అని మర్చిపోవద్దు.
- నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐలు ఏమున్నాయి? వాటిని ఇబ్బంది లేకుండా చెల్లించే ఏర్పాటు ఉందా చూసుకోండి. గత ఏడాది ప్రభుత్వం రుణ వాయిదాలపై 6 నెలల మారటోరియం ప్రకటించింది. ఈసారి ఇలాంటివి ఏమీ ఉండకపోవచ్చు. కాబట్టి, మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే.
- అత్యవసర నిధి నుంచి రాబడి రావాలని చూడకండి. మీరు ఈ నిధికి ప్రత్యేకించిన మొత్తంలో 20 శాతాన్ని ఇంట్లో ఉంచుకోండి. మిగతా మొత్తంలో బ్యాంకు పొదుపు ఖాతాలో 40 శాతం, మిగతా 40 శాతం ఫ్లెక్సీ డిపాజిట్‌లో లేదా లిక్విడ్ ఫండ్లలో జమ చేయండి.
- దురదృష్టవశాత్తూ కరోనా బారిన పడితే.. మన అవసరాల కోసం ఆన్‌లైన్ చెల్లింపులు చేయాల్సి రావచ్చు. కాబట్టి, దీనికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం అవసరమే. సురక్షితంగా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడం తప్పనిసరి.