తెలంగాణ

telangana

ETV Bharat / business

2018-19 భారత వృద్ధి రేటులో మందగమనం! - ద్రవ్య విధాన కమిటీ

2018-19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు స్వల్పంగా తగ్గనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వినియోగం సహా పెట్టుబడులు, ఎగుమతుల్లో క్షీణతే ఇందుకు కారణమని తెలిపింది.

2018-19 భారత వృద్ధి రేటులో మందగమనం!

By

Published : May 3, 2019, 9:50 PM IST

భారత వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా తగ్గే అవకాశముందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వినియోగం క్షీణించడం, పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఎగుమతులు తగ్గడం ఇందుకు కారణమని తెలిపింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ వృద్ధి రేటును 7.2 శాతం నుంచి 7 శాతానికి సవరించింది కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్​ఓ). గడచిన ఐదేళ్లలో ఇదే అత్యల్ప వృద్ధి రేటు.

"వృద్ధి రేటు తగ్గినప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్​ ముందు వరుసలో ఉంటుంది. భవిష్యత్తులో మరింత అభివృద్ధిలో పుంజుకునే అవకాశం ఉంది." -అర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక వృద్ధి సవాళ్ల గురించి చర్చిస్తూ... వ్యవసాయ రంగంలోనూ వద్ధి రేటు పెరగాల్సిన అవసరం ఉందని తెలిపింది.

కరెంట్​ ఖాతా లోటు 2018-19 నాలుగో త్రైమాసికంలోనూ తగ్గిపోనుండటం.. ద్రవ్యలోటు ఎఫ్​ఆర్​బీఎం లక్ష్యానికి చేరువలో ఉండటం భారత ఆర్థిక వ్యవస్థకు కలిసిరానుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

2018-19 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అల్ప స్థాయిలో ఉంది. ఫలితంగా రిజర్వు బ్యాంకు నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశంలో రెపో రేటును తగ్గించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు గత రెండు సమావేశాల్లో రెపో రేటును 0.25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించింది ఎంపీసీ. 2016లో ఎంపీసీ ఏర్పాటైన తర్వాత వరుసగా రెండు సార్లు రెపో రేటును తగ్గించడం ఇదే ప్రథమం.

ఇదీ చూడండి: రేపూ పని చేయనున్న బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి

ABOUT THE AUTHOR

...view details