తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు 2019: నవభారత నిర్మాణం- సుస్థిర ప్రగతి - అంతరిక్షం

కోట్లాది మంది ప్రజల ఆశల మధ్య... ఆర్థిక సవాళ్ల నడుమ తొలిసారి బడ్జెట్​ ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రజలకు భారీ తాయిలాల ప్రకటన లేదు... మధ్యతరగతి ప్రజలు ఊహించిన పన్ను మినహాయింపు లేదు.. అయినప్పటికీ నవభారత నిర్మాణానికై స్థిరమైన ప్రయాణానికి కావాల్సిన కచ్చితమైన ప్రణాళికలు, అవసరమైన మార్గదర్శకాలను ప్రస్తావించారు సీతారామన్. వ్యవసాయం, అంకుర వ్యాపారం, పెట్టుబడులు, విద్య, తదితర రంగాలపై మాత్రం వరాల జల్లు కురిపించారు.

పద్దు 2019: నవభారత నిర్మాణం-సుస్థిర ప్రగతి

By

Published : Jul 5, 2019, 2:13 PM IST

అత్యధిక మెజార్టీతో దేశంలో రెండోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ 2.0 ప్రభుత్వం వార్షిక బడ్జెట్​ను లోక్​సభలో ప్రవేశపెట్టింది. తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా బడ్జెట్​ను ప్రభావవంతంగా ప్రవేశపెట్టారు సీతారామన్​. అన్ని రంగాలపై పూర్తి స్థాయి అవగాహనతో... వాస్తవ పరిస్థితుల చట్రంలోనే బడ్జెట్ ఉన్నట్లు అనిపిస్తోంది.

భారీ తాయిలాలు, హామీలతో ప్రజలను ఆశల ఊహల పల్లకి ఎక్కించకుండా... వాస్తవ పరిస్థితుల మధ్య పక్కా ప్రణాళికలను ప్రకటించారు విత్త మంత్రి.

వ్యవసాయం, వ్యాపారం, అంతరిక్షం, విద్య, ఉద్యోగం, గ్రామీణ భారతం, ఆరోగ్యం సహా పలు విషయాల్లో వాస్తవిక హామీలను కురింపించింది మోదీ 2.0 సర్కారు. ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షేమం, ఆర్థిక ప్రగతిపై దృష్టి కేంద్రీకరిస్తూ.. ఆకాశాన్ని తాకే హామీల జోలికి పోకుండా..దీర్ఘకాలిక ఫలితాలపైనే మోదీ సర్కారు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.

'ఆయుష్మాన్‌ భారత్‌'వంటి పథకాలతో ఆరోగ్య భారతావని నిర్మాణం, మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేశామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో టీమిండియా నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడం, చిన్న ప్రభుత్వం-పెద్ద పాలన వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వివరించారు.

కార్పొరేట్​ ఇండియా...

ప్రభుత్వం చేపట్టిన భారత్‌మాలా, సాగర్‌మాలా, ఉడాన్‌ ప్రాజెక్టులు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వంతెనలా పని చేస్తూ రవాణా రంగ మౌలిక సదుపాయాలు పెంచుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో భారత్‌ మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా ఉందన్నారు విత్త మంత్రి. దేశీయంగా ఆ రంగంలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

రైల్వేలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం

2018 నుంచి 2030 మధ్య రైల్వేల్లో మౌలిక వసతుల కల్పనకు 50 లక్షల కోట్ల రూపాయలు అవసరమని నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించారు. అందుకోసం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

దేశంలో 657 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైలు ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగిస్తోందని నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ ప్రాజెక్టును ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తామన్నారు.

ఒకే దేశం-ఒకే గ్రిడ్​...

రాష్ట్రాలకు విద్యుత్‌ సరసమైన ధరల్లో అందించేందుకుఒకే దేశం-ఒకే గ్రిడ్‌ విధానాన్ని అవలంబించనున్నట్లు తెలిపారు సీతారామన్. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాలకు తక్కువధరలో విద్యుత్తు లభిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

గ్రామ్​ సడక్​ యోజన...

పర్యావరణ హిత పదార్థాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగించి ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన ద్వారా 30 వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్‌. ఇదే పథకం మూడోదశ కింద 80 వేల 250 కోట్ల రూపాయల వ్యయంతో లక్షా 25 వేల కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి పరుస్తామన్నారు.

విదేశీ పెట్టుబడులకు ఊతం...

పెట్టుబడుల మార్కెట్‌ను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు ప్రజా పెట్టుబడుల పరిమితిని 25 నుంచి 35 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణకు భారత్‌ ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతామని బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మీడియా, విమానయానం, బీమా రంగాలలోకి మరిన్ని ఎఫ్​డీఐలను అనుమతించే ప్రక్రియను పరిశీలిస్తామని తెలిపింది. ఇన్సూరెన్స్ మధ్యవర్తిత్వ సంస్థల్లోకి 100% ఎఫ్​డీఐలను అనుమతించనున్నట్లు వెల్లడించారు.

స్టాక్‌ మార్కెట్లలో ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు మరింత వెసులుబాటు కల్పిస్తామని సీతారామన్​ ప్రకటించారు. ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులకు విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపునిస్తామని తెలిపారు.

2022 నాటికి అందరికీ ఇల్లు...

గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు కల్పించడం తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక సంస్కరణలను ప్రకటించారు. గ్రామాలు, పేదలు, రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నట్లు చెప్పారు.

'ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన' ద్వారా 2022 కల్లాఅందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

పరిశ్రమలకు చేయూత...

సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరాల జల్లులు కురిపించారు. కోటి రూపాయల వరకూ రుణాన్ని గంటలోపు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ కింద నమోదైన ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు 2% రాయితీల కల్పనకి 2019-20 ఆర్థిక పద్దులో 350 కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించినట్లు తెలిపారు.

కర్మయోగి మాన్​ధన్​...

చిల్లర వర్తకులకు 'ప్రధానమంత్రి కర్మ యోగి మాన్‌ధన్' పథకం ద్వారా పింఛను అందించనున్నట్లు నిర్మల తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారులుగా మారడానికి కేవలం ఆధార్‌, బ్యాంకు ఖాతాతో పాటు అవసరం మేరకు వివరాలు సమర్పిస్తే సరిపోతుందన్నారు.

5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థికం...

నవీన భారతావని రూపకల్పనే లక్ష్యంగాఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన ప్రణాళికలను బడ్జెట్‌లో ఆవిష్కరించారు. వచ్చే కొన్నేళ్లలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్‌ అవతరించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం పది సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. విధాన నిర్ణయాల అమలును మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.

అంతరిక్షం వైపు ఆశగా...

ప్రపంచంలోనే భారత్‌ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సేవలను వాణిజ్యపరంగానూ వృద్ధి చేసేందుకు 'న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌'(ఎన్​ఎస్​ఐఎల్) పేరుతో కొత్త ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ఇస్రో పరిశోధన, అభివృద్ధి ఫలాలతో లబ్ధిపొందడం సహా అంతర్జాతీయంగా ఇస్రో ఉత్పత్తులకు మార్కెటింగ్‌ చేయటమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details