తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీరేట్లు తగ్గిస్తేనే భారత్​కు మేలు: ఎఫ్​ఐసీసీఐ - వాణిజ్యయుద్ధం

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో కొన్ని రంగాల్లో భారత ఎగుమతులకు డిమాండ్ పెరగనుందని భారత పారిశ్రామిక సమాఖ్య అధ్యక్షుడు సందీప్ సోమని అభిప్రాయపడ్డారు. కీలకమైన ఈ సమయంలో వడ్డీ రేట్లను తగ్గిస్తేనే భారత్​కు లాభిస్తుందని ఆకాంక్షించారు.

వడ్డీరేట్లు తగ్గిస్తేనే భారత్​కు మేలు: ఎఫ్​ఐసీసీఐ

By

Published : May 27, 2019, 7:05 AM IST

వ్యవసాయ ఉత్పత్తులపై వడ్డీరేట్లను తగ్గించి, ఎగుమతులపై స్థిర విధానాలను అమలు చేయాలని భారత పారిశ్రామిక సమాఖ్య అధ్యక్షుడు సందీప్ సోమని ప్రభుత్వానికి సూచించారు. చైనా వ్యాపార పర్యటనలో ఉన్న ఆయన పలు సూచనలు చేశారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధాన్ని అనుకూలంగా మలుచుకుని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచాలన్నారు. చైనా నుంచి పెట్టుబడులను ఆకర్షించాలని, భారత్​లో వారి కంపెనీలు నెలకొల్పేలా ప్రోత్సహించాలన్నారు.

గతేడాది నుంచి అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు పరస్పరం ఎగుమతులపై భారీగా సుంకాలను పెంచాయి. ఈ పరిస్థితుల వల్ల భారత్​కు చెందిన కొన్ని రకాల వస్తువులకు అమెరికా, చైనా మార్కెట్లలో మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని సందీప్​ తెలిపారు.

తన పర్యటనలో భాగంగా చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రితో సందీప్ భేటీ అయ్యారు.

"పోటితత్వం ఉంటే కొన్ని రంగాల్లో చైనాకు మనం ప్రత్యామ్నాయంగా మారవచ్చు. కానీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండాలి. పెట్టుబడి ఖర్చు పెరిగిపోయి భారత ఉత్పత్తులు పోటీలో వెనకబడుతున్నాయి. దేశంలో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి. మన ద్రవ్యోల్బణ రేటు తక్కువగానే ఉంది. కేవలం మూడు శాతంగా కొనసాగుతోంది. బ్యాంకులు 10-11 శాతానికి అప్పులిస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. వడ్డీరేట్లు 100 నుంచి 150 బేసిస్​ పాయింట్లు తగ్గాలి."

-సందీప్ సోమని, భారత పారిశ్రామిక సమాఖ్య అధ్యక్షుడు

సరైన వడ్డీ విధానం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి అంతర్జాతీయ మార్కెట్​లో పోటినిచ్చేవిగా తయారు చెయ్యాలన్నారు సందీప్. వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకుంటోందన్నారు. ఈ సమయంలో అమెరికాకు బదులుగా భారత్​ సోయాబీన్​ను చైనాకు పంపించేందుకు ప్రయత్నించవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: నేడు కాశీలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన

ABOUT THE AUTHOR

...view details