ఆర్థిక సర్వే: భవిష్యత్ ఆశాజనకం... కానీ... 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్రం ఇవాళ ఆర్థిక సర్వేను ఉభయసభలకు సమర్పించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశం 7% వృద్ధి రేటు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది.
2025 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందాలంటే 8% స్థిర వృద్ధిరేటు నమోదు చేయాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా చమురు ధరలు తగ్గే అవకాశాలున్నట్లు తెలిపింది సర్వే. ఇది ఒక అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లాలని సూచించింది.
భవిష్యత్ ఆశాజనకం...
ఈ సర్వే ద్వారా భవిష్యత్ లక్ష్యాలు, వాటిని సాధించుకునేందుకు అనుసరించాల్సిన విధానాలపై కార్యాచరణను సూచించిన ఆర్థిక సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటోందని అంచనావేసింది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో 6.8%కి దేశ వృద్ధిరేటు పరిమితమైంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7% చేరుతుందని తెలిపింది. 2018-19లో నెమ్మదించిన పెట్టుబడులు, వినియోగం మళ్లీ పుంజుకుంటాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
ద్రవ్యలోటును నియంత్రించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది ఆర్థిక సర్వే. 2018-19లో ద్రవ్య లోటు 3.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.
చమురు ధరలు...
అంతర్జాతీయ పరిణామాలు మారుతోన్న దృష్ట్యా 2019-20 లో ముడి చమురు ధరలు తగ్గే అవకాశాలున్నాయన్న ఆర్థిక సర్వే... ఆ ప్రభావం దేశీయంగానూ ఉంటుందని విశ్లేషించింది. చమురు ధరల తగ్గుదలతో దేశ ప్రజల్లో వినిమయశక్తి పెరిగి వృద్ధిరేటు పెరగడానికి దోహదం చేస్తుందని అంచనా వేసింది.
పెట్టుబడులు...
కేంద్రంలో వరుసగా రెండోసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పడినందున విదేశీ, స్వదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశముందని ఆర్థిక సర్వే వివరించింది. డిమాండ్, రుణ లభ్యత పెరగడం వల్ల 2020లో పెట్టుబడులు పెరిగి ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని అంచనావేసింది.
వ్యవసాయం...
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి కొంతమేర మందగిస్తుందని అంచనా వేసింది సర్వే. ఇదే సమయంలో వ్యయాలు పెరగడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మందగమనం, వాణిజ్య ఘర్షణలతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పరిస్థితులను అధిగమించి దేశ ప్రగతి రథాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది.
పరిశ్రమలు...
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి కల్పనకు, ఉత్పత్తి సామర్థ్యం
పెంచడానికి మరింత సులభతర విధానాలు తేవాలని ఆర్థిక సర్వే సూచించింది. అంకుర పరిశ్రమల ప్రోత్సాహానికి నూతన విధానాలను అవలంబించాలని సిఫార్సు చేసింది.
వైద్య రంగం...
దేశ జనాభాలో వృద్ధులు పెరుగుతున్నందున ఆరోగ్య రంగంలోకి మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలని సర్వే సూచించింది. పదవీ విరమణ వయస్సును పెంచే ప్రక్రియను దశల వారీగా అమలుచేయాలని పేర్కొంది. ప్రజా సమాచారాన్ని, ప్రజలతో, ప్రజల కోసం వినియోగించే చర్యలు చేపట్టాలని సూచించింది. సహజ వనరుల వినియోగంలో జాతీయ విధానాన్ని తీసుకురావాలని సిఫార్సు చేసింది.