నేడు పార్లమెంటు ముందుకు ఆర్థిక సర్వే... సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జులై 5న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే.. బడ్జెట్‌కు ముందు కీలకమైన ఆర్థిక సర్వేను నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్. మరుసటి రోజు కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్.. బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
సాధారణంగా కేంద్ర బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెడతారు. అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక వ్యవస్థపై అంచనాలను ఈ సర్వే ద్వారా వెల్లడిస్తారు. కొత్త ప్రభుత్వంలో తొలి ఆర్థిక సర్వేను మొదటిసారిగా సభలో ప్రవేశపెట్టేందుకు ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు సుబ్రమణియన్.
ఆర్థిక సర్వే అంటే ఏమిటీ ?
గడిచిన ఏడాది కాలంగా దేశంలో ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వ విధానాల ఫలితాల గురించి చెప్పేదే ఆర్థిక సర్వే. దీని ఆధారంగా బడ్జెట్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుడు తయారుచేస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ఈ నివేదిక స్పష్టంగా వెల్లడిస్తుంది.
ఆర్థిక సర్వే ఆధారంగా ప్రభుత్వం ఇంకా చేయాల్సిన అభివృద్ధి పనులేంటి? గతేడాది అభివృద్ధి ఏ మేరకు జరిగింది? వంటి విషయాలు తెలుస్తాయి. ప్రధానంగా అభివృద్ధి కార్యక్రమాలపై విశ్లేషణ, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులను తెలియజేస్తుంది.
2019-20 సంవత్సరానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సర్వేలో రైతులు, వ్యవసాయానికి సంబంధించి కొత్త ప్రతిపాదనలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఆహార ఉత్పత్తులకు మద్దతు ధరలు, ఆదాయం, రుణాలు, రవాణా సదుపాయాల లోటు వంటి అంశాలను పరిశీలించనున్నారు