సాధారణంగా పెట్టుబడుల్లో తక్కువ రిస్కు ఉండే సాధానాల్లో మ్యూచువల్ ఫండ్లు ప్రధానమైనవి. అందులో ఇంకా ముఖ్యమైనవి డెట్ ఫండ్లు. డెట్ ఫండ్లు నిర్ణీత సమయంలో స్థిరమైన రిటర్నులు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. ఈక్విటీల్లా.. డెట్ ఫండ్లు ఎక్కువగా హెచ్చుతగ్గులను ఎదుర్కోవు.
అయితే ఇందులో చాలా ఫండ్లు అందుబాటులో ఉండటం వల్ల వీటిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఎక్కువ అయోమయానికి గురవుతారు. ఇందుకోసం మీ అవసరాలు, ఇతర ఆంశాలను పరిశీలించి ఏ ఫండ్ మీకు సరిపోతుందో ఎంపిక చేసుకోవాలి. మరి ఆ అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రిస్కు తక్కువ.. నిర్ణీత ఆదాయం
డెట్ ఫండ్లలో పెట్టే పెట్టుబడుల్లో.. అధిక భాగం స్థిరమైన ఆదాయనిచ్చే సాధనాల్లోకి వెళ్తాయి. ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, బ్యాంకులు జారీ చేసిన బాండ్లు, ట్రెజరీ బిల్లులు, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు వంటివి ఈ జాబితాలోకి వస్తాయి. తక్కువ ఆదాయం వచ్చినా.. రిస్కు పెద్దగా ఉండకూడదు అనుకునే వారికి డెట్ ఫండ్లు సరిగ్గా సరిపోతాయి.
సులభంగా లిక్విడిటీ
డెట్ ఫండ్లకు ముందే నిర్ణయించిన మెచ్యురిటీ డేట్ ఉంటుంది. వీటి లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. దాదాపు వెంటనే నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. బ్యాంకుల్లో పొదుపు ఖాతా ద్వారా వచ్చే వడ్డీ కంటే.. డెట్ ఫండ్లు ఎక్కువ ఆదాయాన్ని అందిస్తాయి. మరీ ముఖ్యంగా డెట్ ఫండ్లపై వచ్చే ఆదాయానికి టీడీఎస్ వర్తించదు. విక్రయించేటప్పుడు మాత్రమే పన్నులను చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర మ్యూచువల్ ఫండ్లతో పోలిస్తే.. వీటికి లావాదేవీల ఛార్జీలు తక్కువగా ఉంటాయి.
వడ్డీ రేట్లు
వడ్డీ రేట్లకు, డెట్ ఫండ్లకు మంచి సంబంధం ఉంది. వడ్డీ రేట్లు తగ్గుతున్నట్లయితే పాత బాండ్ల విలువ, కొత్తగా విడుదల చేసే బాండ్ల విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్నట్లయితే.. అప్పటికే విడుదలైన బాండ్ల విలువ, కొత్తగా విడుదలవుతున్న బాండ్ల కంటే తక్కువగా ఉంటుంది.
వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు అప్పటికే విడుదలైన బాండ్ల విలువ ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి వాటికి సంబంధించిన డెట్ ఫండ్లు మంచి ప్రదర్శన కనబరుస్తాయి.
అందుకే.. డెట్ ఫండ్ల ఎంచుకునేటప్పుడు వడ్డీ రేట్ల సరళిని పరిగణనలోకి తీసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.