దేశంలో నిత్యవసరాల ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఉల్లి ధరలు ఆకాశాన్నంటిన తర్వాత ఇప్పుడు వంట నూనెల ధరలు ఖరీదయ్యాయి. ముఖ్యంగా దిగుమతులపై సుంకాలు పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణంగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వంట నూనెల ధరల పెంపు ఇలానే కొనసాగితే.. వినియోగదారులపై మరింత భారం తప్పదంటున్నాయి.
పామ్ ఆయిల్ ధర రెండు నెలల్లో లీటరుకు రూ.20 పెరిగింది. దీని ప్రభావం ఇతర వంట నూనెలపై పడింది. ఈ కారణంగా వాటి ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
"పామ్ ఆయిల్ ధరలు పెరిగిన కారణంగా.. ఇతర వంట నూనెల ధరలు పెరిగాయి. మలేసియా, ఇండోనేసియాల నుంచి వంట నూనెల దిగుమతి ధరలు పెరగటమే ఇందుకు ప్రధాన కారణం. మున్ముందు వంట నూనెల ధరలు ఇంకా పెరిగే అవకాశముంది." - సలిల్ జైన్, ఆయిల్ సీడ్ మార్కెట్ నిపుణుడు
అయితే వంట నూనెల్లో మనం స్వయం సమృద్ధిగా మారాలంటే.. దేశంలో రైతుల పంటలకు మద్దతు ధర ఇవ్వాలని మరో పరిశ్రమ నిపుణుడు సూచిస్తున్నారు.
"అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వంట నూనెల దిగుమతి ధరలు పెరగటం కారణంగా దేశంలో ధరలు పుంజుకుంటున్నాయి. అయినప్పటికీ రైతులు ప్రస్తుతం అధిక ధరలో నూనె గింజలను కొంటున్నారు. మనం వారిని ఎక్కువగా నూనె గింజలు పండించే దిశగా ప్రోత్సహించాల్సిన అవసరముంది." - బీ.వీ.మెహతా, సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా
అతిపెద్ద దిగుమతిదారుగా..
వంట నూనెలకు భారత్ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. దేశీయ వంట నూనెల అవసరాలకు ఎక్కువ శాతం దిగుమతుల మీదనే ఆధారపడుతోంది. అయితే మున్ముందు మరింత ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడే అవకాశముందని నిపుణుల అంచనా. ఎందుకంటే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోయా పంట చాలా వరకు దెబ్బతింది. ఈ కారణంగా ఈ ఏడాది రబీ సీజన్లో అంచనాలకన్నా తక్కువ సోయా సాగు జరిగినట్లు తెలుస్తోంది.