తెలంగాణ

telangana

ETV Bharat / business

చిరు వ్యాపారులూ... మీ బడ్జెట్​ ఇలా ఉందా? - పన్నులు

ఆర్థిక ప్రణాళిక అనేది ప్రతి ఒక్కరికీ అవసరం. నెలవారీ సంపాదన ఉన్నవారికి ఆదాయంపై ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి  వీరికి ప్రణాళిక కాస్త సులభం. అయితే నెల వారీగా సరైన ఆదాయం లేని వారికి.. అంటే చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి ఆర్థిక ప్రణాళిక అంత సులువు కాదు. అలాంటి వారు ఆర్థిక ప్రణాళిక ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకోండి ఇప్పుడే.

చిరు వ్యాపారుల బడ్జెట్ ప్రణాళిక

By

Published : Jul 20, 2019, 3:52 PM IST

ఉద్యోగం కాకుండా సొంతంగా పని చేసుకునే వారికి ఒక క్రమమైన ఆదాయం ఉండదు. అలా అని నెలవారీ ఖర్చులు ఆగవు. అలాంటప్పుడు గత ఆదాయం ఆధారంగా మాత్రమే ప్రణాళిక వేసుకోగలుగుతాం. మరి ఆ ప్రణాళిక ఎలా ఉండాలంటే...

ఖర్చులు మాత్రమే లెక్కిస్తే సరిపోదు

నెలవారీ ఆదాయంపై అంచనా లేనప్పుడు ఖర్చులు మాత్రమే నమోదు చేసుకోకుండా.. గతంలో సంపాదించిన మొత్తాల ఆధారంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం గ‌త 12 నెలల్లో సగటు ఆదాయం ఎంతో లెక్క‌వేయాలి. ఇంకా చెప్పాలంటే గత 12నెలల్లో త‌క్కువ ఆదాయం ఏ నెల‌లో వ‌చ్చిందో చూడాలి. దీని వ‌ల్ల ఒక్కో నెల‌లో ఆదాయం ఎక్కువ రావ‌డం వ‌ల్ల సగటు పెరిగి.. ఇదే పెరిగిన ఆదాయాన్ని ఎక్కువ‌గా భావించే అవ‌కాశం ఉంది.

బడ్జెట్​పై కసరత్తు అవసరం

ఆర్థిక ప్రణాళిక ఎలా చూసినా కేవలం అంచనానే. కాబ‌ట్టి ఖ‌ర్చులు, బ‌డ్జెట్ ప్రణాళికపై ఎక్కువ క‌స‌ర‌త్తు చేయాలి. గ‌త కొన్ని నెల‌ల ఖ‌ర్చుల‌ ఆధారంగా క‌చ్చితంగా అవ‌స‌ర‌మైనవేంటో తెలుసుకోవాలి. ఆదాయం ఎక్కువగా వచ్చినప్పుడు అనుకున్న వ‌స్తువులు కొనుగోలు చేయాలి. అంతంత మాత్రంగా ఆదాయం ఉన్న‌ప్పుడు అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేసేలా ప్రణాళిక వేసుకోవాలి. అవ‌స‌ర‌మైన ఖ‌ర్చులంటే.. ఇంటి అద్దె లేదా గృహ‌రుణ వాయిదా చెల్లింపులు, ఆహారం, ప్ర‌యాణాల‌కు, కుటుంబ ఖ‌ర్చులు, బీమా, ఆరోగ్య పాల‌సీల ఖ‌ర్చులు త‌దిత‌రాలు వస్తాయి.

ఈ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టు ప్రతి నెల క‌నీస ఖ‌ర్చులుంటాయి. క్ర‌మ‌మైన ఆదాయం లేన‌ప్పుడు.. ఖ‌ర్చుల‌ కోసం కచ్చితమైన మొత్తాల్లోనే ఉండేలా చూసుకోవాలి.

కెరీర్ తొలినాళ్లలో అయితే..

క్ర‌మ‌మైన ఆదాయం లేని మార్గాన్ని కొత్తగా ఎంచుకుంటే ముందు క‌నీస అవ‌స‌రాల‌కు స‌రిప‌డా జ‌మ‌చేసుకోవడంపై దృష్టి సారించాలి. ఆ తర్వాతే తనఖా పెట్టి రుణాలు పొందడం వంటి వాటి గురించి ఆలోచించాలి.

ఒక వేళ స్థిర ఆదాయం పొందే ఉద్యోగం నుంచి వ్యాపారానికి మారుతున్న‌ట్ట‌యితే ముందుగా అప్పులు తీర్చేయ‌డం మంచిది.

ప‌న్ను చెల్లింపులకు ముందే కొంత..

ఖర్చుల్లో భాగంగా చెల్లించాల్సిన ప‌న్నును క‌లిపి చూసుకోండి. ప‌న్ను చెల్లింపులు లాంటివి ఏడాదికోసారి చేస్తుంటాం. అలాంటి వాటి కోసం నెల నెలా కొంత సొమ్ము ప‌క్క‌న పెట్టుకోవ‌డం మంచిది. ఇలా చేయ‌క‌పోతే పన్ను చెల్లించాల్సిన నెలలో ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఈ కారణంగా చేతిలో క‌నీస ఖ‌ర్చుల‌కు సరిపడా మొత్తాలు ఉండవు.

రిజర్వులో కొంత డబ్బు

ఖ‌ర్చుల‌కు త‌గిన‌ట్టుగా క‌నీస ఆదాయం పొందామా లేదా అన్న విష‌యం నెలాఖ‌రులోనే తెలుస్తుంది. ఈ ఇబ్బంది లేకుండా ముందే కొంత డబ్బును రిజ‌ర్వులో పెట్టుకోవ‌డం మంచిది. ఇలా రిజ‌ర్వులో పెట్టుకున్న డబ్బు ఆదాయం లేని స‌మ‌యంలో సాధార‌ణ ఖ‌ర్చుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఇలా రిజ‌ర్వు నుంచి వాడుకున్న సొమ్ము అయిపోగానే తిరిగి దాన్ని నింప‌డం మ‌ర్చిపోవ‌ద్దు. రిజ‌ర్వు డ‌బ్బు అనేది అత్య‌వ‌స‌ర నిధి కాదు. స్వ‌ల్ప‌కాలంలో తలెత్తే ఇబ్బందులకు వాడేది అని గుర్తుంచుకోవాలి.

అత్యవసర నిధి

రిజ‌ర్వులో సొమ్ము కాకుండా కొంత అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోండి. వైద్య‌ప‌ర‌మైన అత్య‌వ‌స‌రం వచ్చినప్పుడు, పెద్ద ఖర్చులున్న‌ప్ప‌ుడు బ‌డ్జెట్ ప్ర‌కారం వీటికి కేటాయించ‌లేం. అలాంటప్పుడు వినియోగించేందుకు వీలుగా.. క‌నీసం 6 నెల‌ల‌కు స‌రిప‌డా అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం మేలు.

ముందే కొంత పొదుపు..

ఆదాయాన్ని ఖ‌ర్చు పెట్టే ముందే కొంత మొత్తాన్ని పొదుపు చేసేందుకు కేటాయించుకోవాలి. మీ ఆర్థిక ల‌క్ష్యాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆపేయ‌కండి. అన‌వ‌స‌ర ఖ‌ర్చు చేసే ప్ర‌తిసారీ మీ లక్ష్యం గుర్తువ‌చ్చేలా పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోండి. అంచ‌నా ఆదాయంలోంచి కొంత భాగాన్ని పొదుపు కోసం కేటాయించుకోండి. ఆదాయం పెరిగే కొద్దీ ఈ శాతాన్ని పెంచుకుంటూ వెళ్తే బాగుంటుంది. దీర్ఘ‌కాల ఉద్దేశంతో కొంత సొమ్మును ప‌క్క‌న పెట్టుకుంటే మ‌రికొంత స్వ‌ల్ప‌కాల అవ‌స‌రాల‌కు ప‌క్క‌న ఉంచుకోవాలి.

పదవీ విరమణ కోసం..

ఉద్యోగమైనా, వ్యాపారమైనా పదవీ విరమణ ఉంటుంది. అయితే ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో.. పింఛనుతో పాటు ఈపీఎఫ్​ ద్వారా కొంత మొత్తాన్ని పొందుతారు. వ్యాపారులకు ఈపీఎఫ్​ లేకపోయినా పీపీఎఫ్​ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. వీటితో పాటు అధిక డివిడెండ్లు ఇచ్చే సంస్థల్లో పెట్టుబడి పెట్టడం, క్రమమైన వడ్డీలు ఇచ్చే పొదుపు మార్గాలను చూసుకోవడం మంచిది.

ఇదీ చూడండి: అంబానీ వేతనం వరుసగా 11 ఏటా అంతే!

ABOUT THE AUTHOR

...view details