"బ్యాడ్ బ్యాంకులపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుపై ప్రతిపాదనలు వస్తే స్వీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. వాటిని పూర్తిగా సమీక్షించి మార్గదర్శకాలు జారీ చేస్తాం. ఆస్తుల పునర్‌వ్యవస్థీకరణ కంపెనీల ఏర్పాటు కోసం ఇప్పటికే ఆర్‌బీఐ రెగ్యులేటరీ గైడ్‌లైన్స్ రూపొందించింది." ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చేసిన వ్యాఖ్యలివి. ఇంతకీ బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుందో చూద్దాం..!
బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం భారత బ్యాంకింగ్ వ్యవస్థలో 8.5 శాతం ఎన్‌పీఏలు ఉన్నట్లు అంచనా. మార్చి నాటికి ఇవి 12.5 శాతానికి... పరిస్థితులు దిగజారితే 14.7 శాతానికీ చేరొచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. ఇదే జరిగితే భారత బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ రంగ సంక్షోభం పెను సవాల్‌గా పరిణమించే అవకాశం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి నిపుణులు చూపిస్తున్న మార్గమే బ్యాడ్ బ్యాంక్.
బ్యాడ్ బ్యాంక్ అంటే..
సాధారణంగా వాణిజ్య బ్యాంకులు అవి ఇచ్చే రుణాలపై వచ్చే వడ్డీ ఆధారంగా మనుగడ సాగిస్తుంటాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల ఫలితంగా కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఒకవేళ అవే రుణాలు నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ)గా అంటే మొండి బకాయిలుగా మారితే బ్యాంకింగ్ వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్‌ల పేరిట ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎన్‌పీఏలను దీనికి బదిలీ చేస్తారు.
బ్యాంకులకేంటి లాభం..
బ్యాడ్ బ్యాంకుల ఏర్పాటు వల్ల బ్యాంకులకు ఎన్‌పీఏల తలనొప్పి తగ్గుతుంది. ఆయా ఖాతాల నుంచి రుణాలను రికవరీ చేయడం, రుణాలు తీసుకున్న సంస్థలతో చర్చలు జరపడం, లేదా ఈ మొండి బకాయిలను ఎలా తిరిగి రాబట్టాలో వంటి అంశాలపై బ్యాడ్ బ్యాంక్ దృష్టి సారిస్తుంది. ఎన్‌పీఏ ఖాతాలు బ్యాడ్ బ్యాంక్‌కు వెళ్లడంతో వాణిజ్య బ్యాంకుల బ్యాలెన్స్ షీట్‌లో వాటి ప్రస్తావన ఉండదు. ఫలితంగా బ్యాంకు పనితీరు మెరుగుపడుతుంది. బ్యాంకు మూలధనం, డిపాజిట్లు పెరిగి బ్యాంకు అభివృద్ధికి బాటలు పడతాయి.
ఏఆర్‌సీ బ్యాడ్ బ్యాంక్‌కు తేడా?
బ్యాంకులు తమ వద్ద ఉన్న ఎన్‌పీఏలను వదిలించుకునేందుకు 'అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ'(ఏఆర్‌సీ)లను ఆశ్రయిస్తుంటాయి. ఏఆర్‌సీలు బ్యాంకుల వద్ద చౌకగా ఎన్‌పీఏలను కొని వాటి ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అలా బ్యాంకులు ఏఆర్‌సీలకు ఎంతో కొంతకు ఎన్‌పీఏలను అమ్మడం వల్ల నష్టాలను మూటగట్టుకుంటాయి. బ్యాడ్ బ్యాంకు కూడా దాదాపు ఏఆర్‌సీ లాంటిదే. కానీ, బ్యాడ్ బ్యాంక్‌లకు వాణిజ్య బ్యాంకులు ఎన్‌పీఏలను విక్రయించవు. కేవలం బదిలీ మాత్రమే చేస్తాయి. తద్వారా సాధారణ బ్యాంకులు వాటి ప్రధాన కార్యకలాపాలపై దృష్టి సారించే అవకాశం ఏర్పడుతుంది. ఇక బ్యాడ్ బ్యాంకు ఎన్‌పీఏలపై పనిచేసి తిరిగి వాటిని ఎలా రాబట్టాలి... అందుకు ఉన్న వెసులుబాట్లపై దృష్టి సారిస్తుంది. రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసి వీలైనంత మొత్తాన్ని రాబట్టేందుకు కృషి చేస్తాయి.
ఈ బడ్జెట్‌లో ప్రస్తావన ఉండనుందా?
ఎన్‌పీఏల సమస్యను పరిష్కరించేందుకు 2017 ఆర్థిక సర్వే 'పబ్లిక్ సెక్టార్ అసెట్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ(పీఏఆర్‌ఏ)'ను ఏర్పాటు చేయాలని అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రతిపాదించింది. దీనికి ప్రతిరూపమే బ్యాడ్ బ్యాంక్. అప్పటి నుంచి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు) ప్రభావం బ్యాంకులపై పడకుండా ఉండాలంటే ప్రభుత్వం చాలా బ్యాడ్ బ్యాంకుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. ఈ మేరకు ముందస్తు బడ్జెట్ (ప్రీ బడ్జెట్) వినతుల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు సీఐఐ పలు సూచనలు చేసింది. అలాగే ఎన్‌పీఏ సమస్య పరిష్కారంపై మోదీ సర్కార్ గత కొంత కాలంగా తీవ్రంగా ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రస్తావన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రముఖుల అభిప్రాయాలు...
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడాన్ని ఆయన రాసిన 'ఐ డూ వాట్ డూ' పుస్తకంలో వ్యతిరేకించారు. ప్రభుత్వానికి చెందిన ఓ ఖజానా నుంచి రుణాలను మరో ఖజానాకు మార్చడం తప్ప పెద్దగా మార్పేమీ ఉండదని వ్యాఖ్యానించారు. కేవలం ప్రభుత్వ బ్యాంకులు వసూలు చేసే అసమర్థత మాత్రమే బ్యాడ్ బ్యాంకులకు బదిలీ అవుతుందని విమర్శించారు. అయితే బ్యాడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలని 'ఇండియన్ బ్యాంక్స్: ఏ టైం టు రిఫార్మ్' పుస్తకంలో రాజన్ సూచించారు. అప్పుడు ఎన్‌పీలను బ్యాడ్ బ్యాంకులను తరలించాలని హితవు పలికారు. మరోవైపు, ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ కొటాక్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనపై ఓ సందర్భంలో పెదవి విరిచారు. రికవరీలు భారీగా చేయగలిగితే తప్ప వీటివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనను బలంగా సమర్థించారు. వీటి వల్ల వాణిజ్య బ్యాంకులకు సాధారణ కార్యకలాపాలపై దృష్టి సారించే వెసులుబాటు కలుగుతుందని వివరించారు.
విమర్శలు...
ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థను సమర్థిస్తున్నవారే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనను సమర్థిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఎగవేతదార్లకు అండగా నిలవడమే దీని లక్ష్యమని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేయడం కంటే ఎగవేతదార్లపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం చేతిలో బ్యాడ్ బ్యాంక్ కీలుబొమ్మగా మారితే.. ఇప్పటికే రుణాలు ఎగ్గొట్టిన కార్పొరేట్లకు మేలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు కంటే బ్యాంకింగ్ నిబంధనల్లోనే మార్పులు తెస్తే సరిపోతుందని హితవు పలుకుతున్నారు. చూడాలి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మరి!