తెలంగాణ

telangana

ETV Bharat / business

'చిన్న పరిశ్రమలకు కావాలి మరింత చేయూత'

కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో ఆత్మనిర్భర్​ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 2020 మేలో మూడు లక్షల కోట్ల రూపాయల అత్యవసర రుణహామీ పథకాన్ని రూపొందించింది. ఇది ఆయా సంస్థలకు భరోసా ఇస్తుందని కేంద్రం భావించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. చిన్నపరిశ్రమలకు పూర్తి స్థాయిలో రుణాలు అందట్లేదనే వాదనల వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పథకం అమలు తీరుతెన్నులపై ప్రత్యేక కథనం..

edit aatma nirbhar bharath small scale industries
'చిన్న పరిశ్రమలకు కావాలి మరింత చేయూత'

By

Published : Dec 22, 2020, 7:32 AM IST

కొవిడ్​ వల్ల చిన్నతరహా పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యాయనడంలో సందేహం లేదు. ఈ రంగానికి చేయూతనందించేందకు, ఆర్థికంగా ఊతమిచ్చి గాడిన పడేసేందుకు రూ.3 లక్షల కోట్ల రూపాయల అత్యవసర రుణహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. బీమాసంస్థకు చెల్లించవలసిన ప్రీమియం మొత్తాన్ని కేంద్రమే భరించి, రుణాలు ఇచ్చే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు రుణ బకాయిల వల్ల ఏమాత్రం నష్టం వాటిల్లకుండా రుణహామీ మంజూరు చేసింది.

సాధించింది తక్కువే..

ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు రూ.25కోట్ల రుణ పరిమితి కలిగిన చిన్నతరహా పరిశ్రమలకు బ్యాంకుల నుంచి అదనపు రుణాలు తీసుకునే సదుపాయం ఈ అత్యవసర రుణ హామీపథకం ద్వారా లభిస్తుంది. ఈ పథకం కింద రూ.25కోట్ల నుంచి రూ.50 కోట్ల రుణ పరిమితి గల చిన్నతరహా పరిశ్రమలూ రుణాలు పొందొచ్చని ఆగస్టులో కేంద్రం ప్రకటించింది. వృత్తినిపుణులు అనగా.. వైద్యులు, న్యాయవాదులు, ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌కూ ఈ పథకాన్ని విస్తరింపజేసింది. కొత్తగా పొందే రుణ మొత్తాన్ని రూ.5కోట్ల నుంచి 10కోట్ల రూపాయలకు పెంచింది. అంతేగాక ఈ పథకం కింద రుణాలు పొందే కంపెనీల అర్హతనూ సడలించింది. గరిష్ఠ ఆదాయ పరిమితిని రూ.100 కోట్ల నుంచి రూ.250 కోట్లకు పెంచింది. ఈ అత్యవసర రుణహామీ పథకం 2020 అక్టోబర్‌ వరకు అమలులో ఉంటుందని తొలుత ప్రకటించింది కేంద్రం. అయితే ఈ పథకం కింద 2020 ఆగస్టు నాటికి బ్యాంకులు రూ.2.03 లక్షల కోట్ల రుణాలను 60.67 లక్షల రుణగ్రహీతలకు మంజూరు చేయగా, కేవలం రూ.1.48 లక్షల కోట్ల విలువగల రుణాలు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో నవంబరు నెల వరకు అటు తర్వాత 2021 మార్చి వరకు పొడిగించింది.

అదనంగా 26రంగాలకూ...

ఆర్‌బీఐ నియమించిన 'కామత్‌ కమిటీ' సిఫార్సుల ప్రకారం ఆర్థిక మాంద్యానికి గురైన 26 రంగాలనూ ఈ పథకం కింద చేరుస్తూ పథకాన్ని మరింత విస్తరించింది కేంద్రం. రుణాలను చెల్లించే కాల పరిమితిని అయిదేళ్ల నుంచి ఆరేళ్లకు పొడిగించింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన అత్యవసర రుణ హామీ పథకం ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదనే చెప్పాలి. ఈ పథకం అమలును అధ్యయనం చేసేందుకు జాతీయ రుణ హామీ సంస్థ పూణెకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఐబీఎమ్‌)ను నియమించుకుంది. ఎన్‌ఐబీఎం నివేదిక ప్రకారం... అత్యవసర రుణ హామీ పథకంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు విరివిగా సన్నకారు రుణాలు ఇవ్వగా, ప్రైవేటు బ్యాంకులు ప్రధానంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అధికంగా రుణాలు మంజూరు చేసినట్టు వెల్లడయింది. మొత్తం రుణాల్లో ఉత్పాదక రంగానికి తక్కువ రుణాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఎక్కువమంది రుణగ్రహీతలు ఈ అత్యవసర రుణ హామీ పథకంలో తీసుకున్న రుణాలని తమ బకాయిలను చెల్లించడానికి వినియోగించినట్లు, దీర్ఘకాలిక వ్యాపార ప్రయోజనాలకోసం తక్కువ మొత్తాన్నే వినియోగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ పథకం లాక్‌డౌన్‌తో ఆర్థికంగా నష్టపోయిన సంస్థలకు ప్రయోజనకరంగా ఉందని 1,722 సంస్థలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి.

రుణాలు సరిపోలే...

అధ్యయనంలో పాల్గొన్న బ్యాంకుల అభిప్రాయం ప్రకారం- తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పలు చిన్న తరహా పరిశ్రమలు కుదేలవడంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ అదనపు వెసులుబాటులో రుణాలు తీసుకోవడానికి వెనుకంజ వేశాయని తేలింది. పత్రాల సమర్పణ షరతులు కొంత ఇబ్బందికరంగా ఉన్నందువల్ల... అర్హత కలిగినప్పటికీ రుణాలు తీసుకోవడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. ఇక మంజూరు చేసే రుణం తమ అవసరాలకు పూర్తిగా సరిపోదని కొందరు రుణగ్రహీతలు అభిప్రాయపడ్డారు.

ఆర్థిక కార్యకలాపాలు పెరిగితేనే...

ఈ పరిణామాలన్నీ నిశితంగా గమనిస్తే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటేనే చిన్న తరహా పరిశ్రమలు బ్యాంకుల్లో అదనపు రుణాలను తీసుకోడానికి ముందుకు వస్తాయని స్పష్టమవుతోంది. ఉపాధి కల్పనతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వీలవుతుంది. కావున ప్రభుత్వం సత్వరమే దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముంది. దేశవ్యాప్తంగా అర్ధాంతరంగా ఆగిపోయి, లేదా జాప్యం వల్ల అసంపూర్ణంగా నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల సంఖ్య 412. వీటిపై ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టగా జాప్యం వల్ల అదనంగా నాలుగు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంది. వీటిలో కీలకమైన ప్రాజెక్టులను గుర్తించి వాటిని వేగవంతం చేస్తే తద్వారా కొన్ని లక్షల శ్రామికులకు ఉపాధి లభిస్తే, వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఈ ప్రాజెక్టులకు అనుబంధంగా సిమెంట్‌, స్టీల్‌, ఇతర నిర్మాణ పరికరాల తయారీ రంగాల్లో గిరాకీ పెరిగి ఉపాధి అవకాశాలు మెరగుపడతాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుని చిన్న తరహా పరిశ్రమలు, ఇతర వర్తక వాణిజ్య ఉత్పాదక రంగాలు ఊపందుకుంటాయి. బ్యాంకుల్లో అదనపు రుణాలను వినియోగించుకునే అవకాశం బలపడుతుంది. ప్రభుత్వం ఈ దిశగా త్వరితగతిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది

ABOUT THE AUTHOR

...view details