దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పదవి నుంచి తప్పుకున్నారు అబిదాలీ నీముచ్‌వాలా. నేడు తెల్లవారు జామున రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కుటుంబపరమైన కారణాలతో ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
కొత్త సీఈఓ నియామకం జరిగే వరకు ఆ పదవిలో కొనసాగునున్నారు అబిదాలీ. విప్రో ఇప్పటికే కొత్త సారథిని వెతికే పనిలో పడింది.
అందరికీ కృతజ్ఞతలు..
"75 సంవత్సరాలకు పైగా గొప్ప చరిత్ర కలిగిన విప్రోకు సేవ చేయటం నాకు లభించిన గౌరవం. మా ప్రయాణంలో మేము గుర్తించదగిన పురోగతిని సాధించాము. మా డెలివరీ విభాగాన్ని అభివృద్ధి చేశాము. కస్టమర్ల వ్యవస్థను వ్యవస్థీకరించాము" అని అబిదాలీ నీముచ్‌వాలా ప్రకటనలో పేర్కొన్నారు.
ఇన్ని సంవత్సరాలుగా తనకు సహాయ సహకారాలందించినందుకు ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, ఆయన కుమారుడు రిషాద్ ప్రేమ్‌జీ, డైరక్టర్లు, సహోద్యోగులు, వినియోగదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.