వాట్సాప్.. ప్రపంచంలో అత్యధికులు ఉపయోగించే మెసేజ్ యాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తూ వినియోగదారులకు మరింత చేరువవుతోంది. ఇతర యాప్‌ల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని నిలబడేందుకు కొత్త ఫీచర్లను జోడిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓ ఫీచర్‌పై వాట్సాప్ తీవ్రంగా కృషి చేస్తోందట.
ప్రస్తుతం వాట్సాప్ ఖాతాను ఒక డివైజ్‌లో మాత్రమే వినియోగించే వీలుంది. వెబ్ వాట్సాప్ ద్వారా కంప్యూటర్‌కు అనుసంధానించవచ్చు. అది కూడా కొన్ని పరిమితులతోనే సాధ్యమవుతుంది. కానీ ఒకే అకౌంట్‌తో మరో మొబైల్ లేదా ఇతర గాడ్జెట్‌లలో వినియోగించాలంటే కుదరదు. ఒకవేళ వేరే డివైజ్‌లో లాగిన్ అయితే మరొకటి దానంతట అదే లాగ్ఔట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇబ్బందిని తొలగించేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
నాలుగింటిలో..
వాట్సాప్‌లో ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు కాదు, ఏకంగా నాలుగు డివైజ్‌లలో ఒకే వాట్సాప్ అకౌంట్‌ను వినియోగించేలా యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది.
"అవును ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ను వినియోగించవచ్చు. ప్రస్తుతం దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక గొప్ప విషయం."