కేటలాగ్ సిద్ధం
వ్యాపారులకు సౌకర్యవంతంగా ఉండటానికి వాట్సాప్ ఇటీవల ‘వాట్సాప్ బిజినెస్’ను తీసుకొచ్చింది. సాధారణ వాట్సాప్ అకౌంట్‌లా కనిపించినా... ఇందులో కొన్ని అదనపు ఫీచర్లు ఉంటాయి. దుకాణదారు వాట్సాప్ నెంబరు మెసేజ్ చేస్తే ‘ఆటోమేటిక్ రిప్లై’ రావడం. అధీకృత నెంబరు అని టిక్ మార్క్ రావడం లాంటివి అన్నమాట. ఇప్పుడు దీనికి అదనంగా కేటలాగ్ ఆప్షన్‌ను జోడిస్తున్నారట. అంటే ఏదైనా రెస్టారెంట్ వాట్సాప్ బిజినెస్ నెంబరు ఇన్ఫో లోకి వెళ్తే... ఆ రెస్టారెంట్‌లో లభించే వస్తువుల జాబితా కనిపిస్తుంది.
కదిలే బొమ్మలు
ప్రస్తుతం వాట్సాప్‌లో అక్షరాలతోపాటు ఇమేజ్‌లు, జిఫ్‌లు పంపుకొనే సౌలభ్యం ఉంది. ఇటీవల దీనికి స్టిక్కర్లు జోడించారు. అయితే నెటిజన్లకు ఎక్కడో చిన్న వెలితి. అవి చిన్నగా కదులుతూ యానిమేట్ అయితే బాగుంటుంది కదా అని. ఇలాంటి వారి కోసమే వాట్సాప్ త్వరలో యానిమేటడ్ స్టిక్కర్లు తీసుకొస్తోంది. అంటే త్వరలో మీరు కదిలే స్టిక్కర్లను షేర్ చేసుకోవచ్చన్నమాట.
నోటిఫికేషన్‌లోనే...
వాట్సాప్‌లో మీరు పంపిన మెసేజ్‌కి మీ ఫ్రెండ్ ఏదో స్టిక్కర్ పంపాడు. నోటిఫికేషన్‌లో ఏదో స్టిక్కర్ అని వచ్చింది. వాడేం పంపాడో చూడాలంటే మళ్లీ యాప్‌లోకి వెళ్లాలి. ఈ ఇబ్బంది లేకుండా త్వరలో నోటిఫికేషన్‌లోనే స్టిక్కర్/యానిమేటడ్ స్టిక్కర్లను నేరుగా చూసుకోవచ్చు. దీని వల్ల ప్రతిసారి వాట్సాప్ యాప్ ఓపెన్ చేసుకునే బాధ తప్పుతుంది.
ఎక్కువసార్లు పంపితే...
వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్/ఇమేజ్/వీడియోను ఫార్వర్డ్ చేస్తే అవతలి వ్యక్తికి అది ఫార్వర్డ్ మెసేజా, లేక నేరుగా పంపించిందా అని చూపిస్తోంది. ఇప్పుడు దీనిని మరింత ఉపయోగకరంగా చేస్తున్నారు. దీని వల్ల మీకు వచ్చిన మెసేజ్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే ‘ఫార్వర్డింగ్ ఇన్ఫో’ అని వస్తుంది. అందులో ఈ మెసేజ్ ఎంతమందికి ఫార్వర్డ్ చేశారు తదితర వివరాలు వచ్చేస్తాయి.
వాట్సాప్‌లోనే...
వాట్సాప్‌లో ఏదైనా వీడియో/యూట్యూబ్ వీడియో వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేస్తే యాప్ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ప్లే అవుతోంది. ఇప్పుడు వెబ్‌సైట్ లింక్స్‌కు కూడా ఇదే స్టైల్‌ను తీసుకొస్తున్నారు. ఇన్-యాప్ బ్రౌజర్ ఆప్షన్ ద్వారా క్లిక్ చేసిన లింక్ వాట్సాప్ యాప్‌లోనే ఓపెన్ అవుతుంది. ఇలా చూసిన లింక్‌లు, సమాచారాన్ని వాట్సాప్ స్టోర్ చేయదు అని నిపుణులు చెబుతున్నారు.
ఐప్యాడ్ వెర్షన్
ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్స్‌కు అందుబాటులో ఉంది. కొన్ని ఆండ్రాయిడ్ ట్యాబ్స్‌లోనూ వినియోగించే అవకాశం ఉంది. ఇప్పుడు వాట్సాప్‌ను ఐప్యాడ్స్‌కు కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉంది వాట్సాప్ బృందం. ఇప్పటికే దీనికి సంబంధించి టెస్టింగ్ ప్రక్రియ జరుగుతోంది. త్వరలో దీనిపై స్పష్టత వస్తుంది.
చీకట్లో ఇబ్బంది లేకుండా...
చీకట్లో ఇబ్బంది లేకుండా... ఇప్పుడు గ్యాడ్జెట్ ప్రపంచం అంతా ‘డార్క్ మోడ్’ చుట్టూ తిరుగుతోంది. మొబైల్స్, యాప్స్, ఓఎస్‌లు ఇలా అన్నీ వెలుతురు నుంచి ఇటువైపు వచ్చేస్తున్నాయి. వాట్సాప్ కూడా ఇప్పుడు అదే దారిలోకి వచ్చింది. త్వరలో వాట్సాప్‌లో ‘డార్క్ మోడ్’ వస్తుందట. అయితే దీన్ని గ్రీన్ మోడ్ అనొచ్చు. ఎందుకంటే స్క్రీన్ గ్రీన్ కలర్‌లో...దానిపై టెక్స్ట్ వైట్ కలర్‌లో కనిపిస్తుందట.
ఇదీ చూడండి:వధువు లేకపోతేనేం... పెళ్లి చేసుకున్నాడు!