దేశంలోని ప్రధాన టెల్కోల మధ్య తలెత్తిన రింగ్ టైం వివాదంపై టెలికాం నియంత్రణ 'ట్రాయ్' కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్‌కు 30 సెకన్లు, ల్యాండ్‌లైన్‌కు 60 సెకన్ల ప్రామాణిక రింగ్టైంను నిర్దేశిస్తూ నిర్ణయం తీసుకుంది. కాల్ రిసీవ్ చేసుకునే వ్యక్తి.. ఫోన్‌కు సమాధానం ఇవ్వకున్నా.. తిరస్కరించకున్నా.. ప్రామాణిక సమయం వరకు ఫోన్ మోగాల్సిందేనని ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ ప్రామాణిక రింగింగ్ సమయాలు దేశీయంగా చేసే కాల్స్‌కు మాత్రమే వర్తిస్తాయని ట్రాయ్ పేర్కొంది.
రింగ్టైం వివాదం ఏంటంటే..?
దేశంలోని ప్రధాన టెలికాం దిగ్గజాలైన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారులు.. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నాయి. రిలయన్స్ జియో తమ నెట్‌వర్క్‌కు వచ్చే కాల్స్‌పై రింగ్టైమ్ను 25 సెకన్లకు తగ్గించడమే ఇందుకు ప్రధాన కారణమని ఈ రెండు సంస్థలు పేర్కొన్నాయి.
జియో మాత్రం తొలుత ఆయా సంస్థలే నిబంధనలు ఉల్లంగించాయని.. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్రాయ్‌కు ఫిర్యాదు చేశాయి.