రిలయన్స్ జియోలోకి అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రత్యామ్నాయ ఆస్తుల సంస్థ- టీపీజీ.. జియోలో రూ.4,546.80 కోట్లతో 0.93 శాతం వాటాను కొనుగోలు చేసింది.
ఫలితంగా జియో ఫ్లాట్‌ఫాం ఆకర్షించిన నిధుల మొత్తం రూ.1.02 లక్షల కోట్లకు చేరింది. ఇందులో ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాడలా, ఆడియా, టీపీజీలు మొత్తం 22 శాతం జియో వాటాలను దక్కించుకున్నాయి. ఎల్ కేటర్టన్ రూ. 1894.50 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జియో ప్రకటించింది. ఇది మొత్తం వాటాల్లో 0.39 శాతం.
ఫేస్‌బుక్‌తో ప్రారంభం..
జియోలో ఏప్రిల్ 22న ఫేస్బుక్ 9.99 శాతం వాటాను రూ.43,574 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే సిల్వర్ లేక్ 1.15 శాతం వాటాలను స్వీకరించింది. తర్వాత విస్టా ఈక్విటీ 2.32 శాతం, జనరల్ అట్లాంటిక్ 1.34 శాతం, కేకేఆర్ 2.32 శాతం కొనుగోలు చేశాయి.