స్టాక్ మార్కెట్లతో నేడు లాభనష్టాలు దోబూచులాడుతున్నాయి. ఓ దశలో 100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ తిరిగి కాసేపటికే లాభాలను నమోదు చేసింది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 130 పాయింట్లు బలపడి 39,160 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30 పాయింట్ల స్వల్ప లాభంతో 11,778 వద్ద కొనసాగుతోంది.
గత సెషన్లో భారీగా పతనమైన యస్ బ్యాంకు షేర్లు తిరిగి లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఇవీ కారణాలు
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్య ఆర్థిక పరిస్థితిపై మిశ్రమ సంకేతాలిచ్చింది. ఫలితంగా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
లాభానష్టాల్లోనివే
సెన్సెక్స్‌లో యస్ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, ఎం&ఎం, రిలయన్స్, పవర్‌గ్రిడ్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
టాటా మోటార్స్, మారుతి, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.
రూపాయి, ముడిచమురు
రూపాయి నేడు ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.57 వద్ద కొనసాగుతోంది.
ముడి చమురు ధరల బ్రెంట్ సూచీ 0.28 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 71.98 డాలర్లుగా ఉంది.
ఇతరమార్కెట్లు ఇలా..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు షాంఘై సూచీ, జపాన్ సూచీ నిక్కీ, దక్షిణ కొరియా సూచీ కోస్పిలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.