తెలంగాణ

telangana

ETV Bharat / business

అంచనాలకు మించి బుల్ జోరు- రూపాయి పైపైకి

కేంద్రంలో మరోమారు ఎన్డీఏ అధికారం చేపట్టనుందన్న అంచనాలు మదుపర్లలో ఉత్సాహం నింపాయి. ఫలితంగా స్టాక్​మార్కెట్లు లాభాల బాటలో రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాయి సూచీలు. సెన్సెక్స్​ 940 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 285 పాయింట్లు పుంజుకుంది.

By

Published : May 20, 2019, 9:41 AM IST

Updated : May 20, 2019, 10:31 AM IST

స్టాక్ మార్కెట్లు

ఎగ్జిట్​ పోల్స్​ నింపిన జోష్​తో స్టాక్​మార్కెట్లు నేడు రికార్డు స్థాయి లాభాలతో ప్రారంభమయ్యాయి. నూతన గరిష్ఠాల దిశగా దూసుకెళ్తున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ఏకంగా 940 పాయింట్లు వృద్ధిచెందింది. ప్రస్తుతం 38,870 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ దాదాపు 285 పాయింట్ల లాభంతో 11,695 వద్ద కొనసాగుతోంది.

ఇవీ కారణాలు

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఆదివారం ముగిశాయి. పలు సంస్థలు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ ఫోల్స్ అధికార కూటమికే ప్రజలు పట్టం కట్టినట్లు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ బలపడింది. భారీగా కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

లాభానష్టాల్లోనివే

ఎస్​బీఐ, ఇండస్ఇండ్​ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యంకు, ఎల్​&టీ, మారుతీ, ఎం&ఎం, ఎస్​ బ్యాంకు, టాట్ స్టీల్​, రిలయన్స్, టాట్​ మోటార్స్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 30 షేర్ల ఇండెక్స్​లో దాదాపు అన్ని షేర్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.

సెబీ నిఘా

ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో మార్కెట్లు తీవ్రంగా స్పందిస్తాయని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ 'సెబీ' ముందే అంచనా వేసింది. అయితే ఇలాంటి సమయంలో అవకతవకలు జరిగేందుకు అవకాశమివ్వకుండా ప్రతి క్షణం మార్కెట్ల కదలికలపై నిఘా ఉంచనున్నట్లు తెలిపింది.

సెబీతో పాటు బీఎస్​ఈ కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

రూపాయి పైపైకి

రూపాయి నేటి ట్రేడింగ్ ప్రారంభంలో 79 పైసలు పుంజుకుంది. డాలర్​తో రూపాయి మారకం విలువ 69.44 వద్ద కొనసాగుతోంది.

చమురు సెగ

అమెరికా-ఇరాన్​ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటన్న నేపథ్యంలో ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 1.48 శాతం పెరిగింది. బ్యారెల్​ ముడి చమురు ధర 73.28కి చేరింది.

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి.

Last Updated : May 20, 2019, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details