వడ్డీ రేట్లలో కోత విధిస్తూ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకుంది. అయితే జీడీపీ అంచనాల్లో తగ్గింపు, స్కైమెట్ ఇచ్చిన వాతావరణ అంచనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 192.40 పాయింట్లు నష్టపోయి 38,684.72 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 45.95 పాయింట్ల నష్టంతో11,598 పాయింట్ల వద్ద సెషన్ ముగించింది.
ఇదీ కారణం
నేడు జరిగిన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. ఇది మార్కెట్లకు కలిసొచ్చే విషయమే అయినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతానికి తగ్గించింది ఆర్బీఐ.
మిడ్‌సెషన్ వరకు మిశ్రమ ఫలితాల మధ్య సాగిన మార్కెట్లు... ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. వీటికి తోడు ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని 'స్కైమెట్' అంచనా వేసింది. ఈ అంశాలు మదుపరుల సెంటిమెంటును ప్రభావితం చేశాయి.