స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెషన్ ప్రారంభంలోనే అమ్మకాల ఒత్తిడికిలోనైన సూచీలు.. చివరకు తేరుకుని జీవిత గరిష్ఠాలను నమోదు చేశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 39,750 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 4 పాయింట్ల వృద్ధితో..11,929 వద్ద సెషన్ ముగించింది.
ఇంట్రాడే సాగిందిలా
స్వల్ప లాభాలతో సానుకూలంగా ప్రారంభమైన సెన్సెక్స్ 39,499 - 39,829 పాయింట్ల మధ్య కదలాడింది.
నిఫ్టీ నేటి ఇంట్రాడేలో 11,960 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా... ఓ దశలో 11, 865 పాయింట్ల కనిష్ఠానికి తగ్గింది.
విశ్లేషణ
మదుపరులు నేడు మిశ్రమంగా స్పందించారు. ఫలితంగా ప్రారంభం నుంచే సూచీలు స్వల్ప ఒడుదొడుకులు లోనయ్యాయి. ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మదుపరుల సెంటిమెంట్ బలపడింది. సుస్థిర విదేశీ పెట్టుబడులు నేటి లాభాలకు ప్రధాన కారణం.