తెలంగాణ

telangana

ETV Bharat / business

'వర్క్‌ ఫ్రమ్‌ హోం'పై మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం

కరోనా దెబ్బకు దాదాపు ప్రతి సంస్థ ఉద్యోగులకు 'వర్క్‌ ఫ్రమ్‌ హోం' ఆప్షన్​ను ఇస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తగ్గినా శాశ్వతంగా ఇదే విధానాన్ని కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.

microsoft latest news
'వర్క్‌ ఫ్రమ్‌ హోం'పై మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం

By

Published : Oct 10, 2020, 1:15 PM IST

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల పనితీరుకు సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొంతమంది ఇకపై శాశ్వతంగా అదే విధానాన్ని కొనసాగించే ప్రత్యామ్నాయాన్ని వారి ముందుంచింది. అయితే, అన్ని రకాల ఉద్యోగులకు ఇది వర్తించదని స్పష్టం చేసింది.

హార్డ్‌వేర్‌ ల్యాబ్స్‌, డేటా సెంటర్లు, శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయాలకు రావాల్సిందేనని వెల్లడించింది. అయితే, సగం లేదా అంతకంటే తక్కువ పనిదినాల్లో మాత్రమే ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించింది. దీనిపై ఆయా విభాగాల మేనేజర్లతో ఉద్యోగులు చర్చించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది.

ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు వారి నివాస స్థలాల్ని కూడా మార్చుకునే అవకాశం ఇచ్చింది. అమెరికాలో వారి సొంత ప్రదేశాలకు లేదా విదేశీయలు తమ సొంత దేశాలకు కూడా వెళ్లి పనిచేసే వెసులుబాటు కల్పించింది. కానీ, ఆ మేరకు జీతభత్యాల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. దీనికి మేనేజర్‌ అనుమతి తప్పనిసరి అని తెలిపింది. కరోనా ఆంక్షలు పూర్తిగా తొలగించిన తర్వాత ఆఫీసు పనివేళల్లోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది.

ఇప్పటికే పలు సాంకేతిక దిగ్గజ కంపెనీలు ఇంటి నుంచి పని(వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) విధానాన్ని శాశ్వతం చేసిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌కు చెందిన ఉద్యోగుల్లో సగానికి పైగా మంది రాబోయే ఐదు నుంచి పదేళ్ల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ట్విటర్‌, స్క్వేర్‌ తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా అదే విధానాన్ని అనుసరించనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details