తెలంగాణ

telangana

ETV Bharat / business

సంపన్నుల్లో 'అంబానీ'.. దాతృత్వంలో 'శివ్​ నాడార్​'

హెచ్​సీఎల్​​ టెక్నాలజీస్ ఛైర్మన్​ శివ్​ నాడార్​కు దేశంలోనే అత్యంత దానశీలులలో ప్రథమ స్థానం దక్కింది. ఎడెల్గివ్‌ ఫౌండేషన్‌, హ్యూరన్‌ ఇండియా సంయుక్తంగా రూపొందించిన జాబితాలో ఆయనకు ఈ స్థానాన్ని కల్పించాయి. దాతృత్వ కార్యకలాపాలకు రూ.826 కోట్లు వెచ్చించినందుకు గానూ ఈ గుర్తింపునిచ్చాయి.

శివ్​ నాడార్

By

Published : Oct 15, 2019, 4:20 PM IST

దేశంలోని అత్యంత దానశీలుడిగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్మన్‌ శివ్‌ నాడార్‌ అగ్రస్థానంలో నిలిచారు. అత్యంత శ్రీమంతుడిగా వెలుగొందుతున్న రిలయన్స్‌ ముకేశ్‌ అంబానీకి జాబితాలో మూడో స్థానం లభించడం గమనార్హం. దాతృత్వ కార్యకలాపాలకు 21 బిలియన్‌ డాలర్లు ప్రకటించిన విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ రెండో స్థానం పొందారు.

2019 సంవత్సరానికి ఎడెల్గివ్‌ ఫౌండేషన్‌, హ్యూరన్‌ ఇండియాలు సంయుక్తంగా ఈ జాబితాను రూపొందించాయి. ఈ జాబితా ప్రకారం శివ్‌ నాడార్‌, ఆయన కుటుంబం రూ.826 కోట్లు విరాళంగా ఇచ్చింది. ప్రేమ్‌జీ రూ.453 కోట్లు, ముకేశ్‌ అంబానీ రూ.402 కోట్లు దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించారు. లాభాల్లో 2 శాతాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయించాలని కంపెనీల చట్టం- 2013లో తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

జాబితాలోని మరికొన్ని ముఖ్య విషయాలు..

  • వ్యక్తిగతంగా, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఏడాదిలో రూ.5 కోట్లకు మించి విరాళంగా ఇచ్చిన 100 మందితో జాబితాను రూపొందించారు.
  • జాబితాలోని 100 మంది మొత్తంగా ఇచ్చిన విరాళం రూ.4,391 కోట్లు. ఇందులో మొదటి 10 మంది వాటానే 63 శాతం.
  • 2018తో పోలిస్తే జాబితాలో విరాళాల మొత్తం 90 శాతం పెరిగింది. 2018 జాబితాలో మొత్తంగా రూ.2,310 కోట్లు విరాళం ఇవ్వగా.. ఇప్పుడు రూ.4,391 కోట్లు పెరిగింది.
  • రూ.10 కోట్లకు మించి విరాళమిచ్చిన వారి సంఖ్య కూడా ఏడాది క్రితంతో పోలిస్తే 38 నుంచి 72కి చేరింది.
  • విద్య కోసం ఎక్కువ మంది విరాళమిచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ కోసం ఎక్కువగా వెచ్చించారు.
  • మొత్తం నిధుల్లో 47 శాతం (రూ.2,310 కోట్లు) వ్యక్తిగత నిధులు కాగా.. 53 శాతం సీఎస్‌ఆర్‌ రూపేణా ఇచ్చినవి.
  • ఇన్ఫోసిస్‌ సహా వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, ఆయన భార్య రోహిణి కలిసి రూ.346 కోట్లు దాతృత్వ కార్యకలాపాల కోసం విరాళంగా ఇచ్చారు. ఇందుకు ఆయన సామాజిక ప్లాట్‌ఫాంలను మార్గంగా ఎంచుకుంటున్నారు.
  • వయసు పెరిగే కొద్ది దాతృత్వం వైపు ఆసక్తి కనబరుస్తున్నట్లు నివేదిక గుర్తించింది. ఎందుకంటే జాబితాలోని వ్యక్తుల సగటు వయసు 64 సంవత్సరాలు.
  • కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టిన వారు కూడా దాతృత్వ కార్యకలాపాల విషయంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.
  • ఆయా కంపెనీలు వెల్లడించిన వివరాలు, ఇంటర్వ్యూల సందర్భంగా చెప్పిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.
  • వ్యక్తుల ఆధారంగానే జాబితాను రూపొందించినందున టాటాలను పరిగణనలోకి తీసుకోలేదు.
  • జాబితాలో అత్యధికం ముంబయి (31 మంది) నుంచి ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ (16 మంది), బెంగళూరు (11 మంది) ఉన్నాయి.

ఇదీ చూడండి: ఆర్థిక పునరుజ్జీవం ఇప్పట్లో అసాధ్యం: అభిజిత్

ABOUT THE AUTHOR

...view details