లోహ,ఆర్థిక రంగ వాటాల కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు ఊతమందించాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ-సెన్సెక్స్ 166 పాయింట్లు బలపడింది. చివరకు 39,950 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ-నిఫ్టీ 43 పాయింట్ల వృద్ధితో 11,966 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా
స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్.. 39,760 - 40,066 పాయింట్ల మధ్య కదలాడింది.
నిఫ్టీ నేడు 12,000 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఓ దశలో 11,904 పాయింట్ల కనిష్ఠానికి తగ్గింది.
విశ్లేషణ
మెక్సికోపై అధిక సుంకాలను ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. చైనాతోనూ సానుకూల వాణిజ్య చర్చలు జరుగుతాయనే అంచనాలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా కొనుగోళ్లు కొనసాగాయి.
లాభనష్టాల్లోనివి ఇవే..
టాటా మోటార్స్ 2.71 శాతం, ఓఎన్జీసీ 2.58 శాతం, ఎస్ బ్యాంకు 2.50 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.39 శాతం, వేదాంత 2.30 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.43 శాతం లాభపడ్డాయి.
సన్ ఫార్మా 3 శాతం, ఎం & ఎం 1.38 శాతం, ఎల్ &టీ 0.49 శాతం, హెచ్డీఎఫ్సీ 0.43 శాతం, హెచ్‌యూఎల్ 0.41 శాతం, పవర్ గ్రిడ్ 0.23 శాతం నష్టాలను నమోదు చేశాయి.
రూపాయి, ముడిచమురు
నేడు రూపాయి 21 పైసలు బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.44కి చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 62.24 డాలర్లుగా ఉంది.
ఇతర మార్కెట్లు ఇలా..
ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు.. షాంఘై సూచీ 2.58 శాతం, హాంకాంగ్ సూచీ-హాంగ్ సెంగ్ 0.76 శాతం, జపాన్ సూచీ-నిక్కీ 0.33 శాతం, దక్షిణ కొరియా సూచీ-కోస్పీ 0.59 శాతం లాభపడ్డాయి.
ఇదీ చూడండి: బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు మరిన్ని సేవలు