భారత మార్కెట్లో.. వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను ఆవిష్కరించేందుకు ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ సిద్ధమైంది. ఈ నెల 17న వీటిని విడుదల చేయనున్నట్లు చైనాకు చెందిన ఈ సంస్థ ఇదివరకే ప్రకటించింది.
యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన ఎయిర్‌పాడ్స్‌కు పోటీగా ఇంచుమించు అదే డిజైన్‌తో రియల్‌మీ వీటిని తేనుండటం గమనార్హం. వీటికి రియల్‌మీ 'బడ్స్ ఎయిర్'గా నామకరణం చేసింది ఆ సంస్థ. అయితే, విడుదలకు ముందే వీటి ధర, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
లీకైన వివరాల ప్రకారం..
ఈ ఇయర్ బడ్స్ ధర రూ.4,999గా ఉండే అవకాశం ఉంది. డ్యూయల్ మైక్రోఫోన్, ఎలక్ట్రానిక్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో రానున్నాయి. వేర్ డిటెక్షన్, టచ్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో దీన్ని ఛార్జింగ్ చేయొచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 17 గంటల పాటు వీటిని వినియోగించొచ్చు. వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం ఇందులో అందిస్తున్నట్లు ఇది వరకే కంపెనీ ప్రకటించింది.
దిల్లీలో 17న నిర్వహించే కార్యక్రమంలో ఇయర్‌బడ్స్ సహా రియల్‌మీ 'ఎక్స్2' స్మార్ట్ఫోన్నూ.. ఆ సంస్థ విడుదల చేయనుంది.
ఇదీ చూడండి:నెలాఖరున మార్కెట్లోకి 'ఒప్పో 5జీ' సిరీస్ ఫోన్లు