ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) 2018-19 చివరి త్రైమాసికంలో రూ. 4,750 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే బ్యాంకు నష్టాలు 65 శాతం తగ్గాయి. 2017-18 చివరి త్రైమాసికంలో రూ.13,417 కోట్ల నష్టాన్ని ప్రకటించింది పీఎన్బీ.
వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీల కుంభకోణంతో బ్యాంకు భారీ నష్టాలను మూటగట్టుకుంది.
మొండి రుణాలకు కేటాయించే మొత్తాలు తగ్గడం, స్థూల నిరర్ధక ఆస్తులు మెరుగవడం కారణంగా గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంకు నష్టాలు 65 శాతం తగ్గాయని పీఎన్బీ పేర్కొంది.
2017-18 క్యూ4లో 18.38 శాతంగా ఉన్న బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 2018-19లో 15.50 శాతానికి తగ్గాయి.
2018-19 ఆర్థిక సంవత్సరం క్యూ4లో మొత్తం ఆదాయం రూ.14,725.13 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే సమయానికి బ్యాంకు ఆదాయం రూ.12,945.68 కోట్లుగా ఉంది.