తెలంగాణ

telangana

ETV Bharat / business

నియంత్రణతోనే ప్రజావిశ్వాసం - పీఎంసీ కుంభకోణపై తాజా వార్తలు

మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ)లో వెలుగు చూసిన కుంభకోణ ఉదంతం.. అందరి దృష్టీ సహకార బ్యాంకులపై పడేలా చేసింది. భారతీయ బ్యాంకింగ్​ వ్యవస్థ సురక్షితం, సుస్థిరమని, భయపడాల్సిన అవసరం లేదని రిజర్వు బ్యాంకు... ప్రజలకు మరోసారి గట్టిగా హామీ ఇవ్వాల్సి వచ్చింది. సహకార బ్యాంకుల ముందు ఉన్న సవాళ్లు, పరిష్కార మార్గాలు వంటి అంశాలను పరిశీలించాల్సిన అవసరం నెలకొంది.

నియంత్రణతోనే ప్రజావిశ్వాసం

By

Published : Oct 26, 2019, 10:09 AM IST

సహకార బ్యాంకుల స్థితిగతులు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. దేశంలోని అతి పెద్ద పట్టణ సహకార బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్‌, మహారాష్ట్ర సహకార బ్యాంకు(పీఎంసీ)లో వెలుగు చూసిన కుంభకోణ ఉదంతం- అందరి దృష్టీ వీటిపై పడేలా చేసింది. పీఎంసీ బ్యాంకు నుంచి డబ్బులు ఉపసంహరించుకోకుండా రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించడం, కొంతమంది డిపాజిటర్లు మరణించడంతో ఖాతాదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ సురక్షితం, సుస్థిరమని, భయపడాల్సిన అవసరం లేదని రిజర్వు బ్యాంకు ప్రజలకు మరోసారి గట్టిగా హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో సహకార బ్యాంకుల ప్రస్తుత పరిస్థితి, వాటి ముందున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు వంటి అంశాలను పరిశీలించాల్సిన అవసరం నెలకొంది. సహకార రంగంలోని బ్యాంకులపై ప్రజలకు నమ్మకం పెరిగేందుకు, స్థూలంగా ఆర్థిక రంగం క్షేమం కోసం సత్వర చర్యలు తీసుకోక తప్పదు.

భయపెడుతున్న సవాళ్లు

రుణ వితరణలో సహకార సంస్థలదే ముఖ్యమైన పాత్ర. ముఖ్యంగా బ్యాంకుల గడప తొక్కని ప్రజలకు సైతం ఇవి అందించే సేవ ఎనలేనిది. భారత సహకార ఉద్యమం 19వ శతాబ్దం మలినాళ్లలో మొదలైంది. గ్రామాల్లో అధిక వడ్డీల్ని దండుకునే రుణదాతలకు ప్రత్యామ్నాయంగా ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయి. ప్రాథమికంగా, సహకార బ్యాంకులు చిన్నమొత్తం రుణగ్రహీతలు, వ్యాపారస్తులకు అప్పులిచ్చాయి.

డిపాజిటర్లు ఇలాంటి బ్యాంకుల వైపు ఆకర్షితులు కావడానికి అధిక వడ్డీరేట్లు, వ్యక్తిగత శ్రద్ధ వంటి అంశాలూ దోహదపడ్డాయి. 2018 నాటి గణాంకాల ప్రకారం ప్రస్తుతం- సహకార వ్యవస్థలో 1,551 పట్టణ సహకార బ్యాంకు (యూసీబీ)లు, 96,612 గ్రామీణ సహకార బ్యాంకులున్నాయి. గ్రామీణ సహకార బ్యాంకులు గ్రామాలు, చిన్న పట్టణాల్లో తమ పరిధిలోని జనాభాకు ఆర్థిక సేవలు అందిస్తున్నాయి. యూసీబీలు పట్టణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో రుణ సౌకర్యాల్ని సమకూరుస్తున్నాయి.

భారత బ్యాంకింగ్‌ రంగం పురోగతి, ధోరణులపై 2017-18 రిజర్వు బ్యాంకు నివేదిక ప్రస్తుతం మనదేశంలోని సహకార బ్యాంకుల స్థితిగతులకు అద్దం పట్టింది. గ్రామీణ సహకార సంస్థల విషయానికొస్తే- ఆస్తుల నాణ్యత, లాభదాయకతల్లో వాటి పనితీరు భిన్నంగా ఉంది. అదే, రాష్ట్ర సహకార బ్యాంకులు నిరర్థక ఆస్తుల విషయంలో మెరుగైన నిష్పత్తులు, లాభదాయకతల్ని కలిగి ఉన్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)ల్లో రెండు రకాల ప్రమాణాలూ క్షీణించాయి. వ్యవసాయ రంగంలోని సహకార సంస్థల దీర్ఘకాలిక ఆర్థిక పనితీరు నానాటికీ మరింతగా దిగజారుతోంది.

ఇక- పట్టణ సహకార సంస్థలకు సంబంధించి రిజర్వుబ్యాంకు గణాంకాల ప్రకారం... ఆస్తుల నాణ్యత మెరుగైందని, స్థూల లాభదాయకత ఓ మోస్తరుగా ఉందని తేలింది. మొత్తం 1,551 బ్యాంకుల్లో 26 ‘నియంత్రణ’ దిశలో ఉండగా, 46 ప్రతికూల విలువను కలిగి ఉన్నాయి. పట్టణ సహకార బ్యాంకుల్లో కుంభకోణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 2001లో గుజరాత్‌లో వెలుగు చూసిన మాధవపుర సహకార బ్యాంకు ఉదంతమే ఇందుకో ఉదాహరణ. స్టాక్‌బ్రోకర్‌ కేతన్‌ పరేఖ్‌కు పెద్దమొత్తాల్లో రుణాలివ్వడంతో ఈ కుంభకోణం విలువ భారీస్థాయిలో నమోదైంది.

సహకార బ్యాంకులు 1966లో రిజర్వు బ్యాంకు పర్యవేక్షణ పరిధిలోకి వచ్చాయి. అయితే, వీటికి ద్వంద్వ నియంత్రణ సమస్యలు ఎదురయ్యాయి. పట్టణ సహకార బ్యాంకుల నియంత్రణ, పర్యవేక్షణ రిజర్వు బ్యాంకే చేపట్టినా... ఒకే రాష్ట్రం పరిధిలో అయితే రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్‌ (ఆర్‌సీఎస్‌), బహుళ రాష్ట్రాలైతే కేంద్ర సహకార సంఘాల రిజిస్ట్రార్‌ (సీసీఎస్‌ఆర్‌) పర్యవేక్షిస్తారు.

ఎన్నికల నిర్వహణ, ఆడిటింగ్‌తోపాటు పలు పాలనపరమైన సమస్యలపై ఆర్‌సీఎస్‌ నియంత్రణ ఉంటుంది. రిజర్వు బ్యాంకు పర్యవేక్షణలో... లైసెన్స్‌ మంజూరు, నగదు నిల్వల నిర్వహణ, మూలధన నిష్పత్తులు, తనిఖీల వంటి అన్ని రకాల నియంత్రణ చర్యలు ఉంటాయి. ఇలాంటి ద్వంద్వ నియంత్రణ ఫలితంగా, రిజర్వుబ్యాంకుకు ప్రైవేటు బ్యాంకులపై ఉన్నంత పట్టు, సహకార బ్యాంకులపై లేదనే అభిప్రాయం నెలకొంది.

రిజర్వు బ్యాంకు 1993-2004 మధ్య పట్టణ సహకార బ్యాంకుల కోసం తీసుకొచ్చిన లైసెన్స్‌ విధానం వాటి సంఖ్య పెరగడానికి కారణమైంది. ఆ తరవాత, ఈ రంగంలో సమస్యలు సుస్పష్టమయ్యాక రిజర్వు బ్యాంకు కొత్త లైసెన్సుల మంజూరును నిలిపివేసింది. బలహీనంగా ఉన్న పట్టణ సహకార బ్యాంకుల విలీనం, నష్టాల్లో ఉన్నవాటి మూసివేతలకు సంబంధించి తన దార్శనిక పత్రంలో నియంత్రణ, పర్యవేక్షక విధానాల్ని వివరించింది. నియంత్రణకు సంబంధించిన తనిఖీలు అమలులో ఉన్నా- బలహీన కార్పొరేట్‌ పాలన, వృత్తినైపుణ్యం లోపించడం, సాంకేతికతను అందిపుచ్చుకొనే విషయంలో తిరస్కార ధోరణి వంటివి కొన్ని పట్టించుకోదగిన అంశాలు. వాణిజ్య బ్యాంకుల విస్తరణ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరిగిన కారణంగా సహకార బ్యాంకుల పాత్ర తగ్గింది.

చెల్లింపు బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి పోటీ కూడా వీటిని దెబ్బతీస్తోంది. మూలధనానికి సంబంధించిన సమస్యలూ వేధిస్తున్నాయి. సహకార వ్యవస్థలో వృత్తి నైపుణ్యంతో కూడిన బోర్డు లేకపోవడం పెద్ద లోపం. ఒక సహకార బ్యాంకుకు చెందిన బోర్డు డైరెక్టర్లు బ్యాంకు సభ్యుల ద్వారా ఎన్నికవుతారు. ఈ ప్రక్రియ మొత్తం రాజకీయ నాయకులు బ్యాంకుపై నియంత్రణ సాధించే ఆటలో భాగంగా మారుతుంది. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సంస్థలపై రాజకీయ నియంత్రణ ద్వారా రుణాల మంజూరు, ఉద్యోగ కల్పన వంటివి జరుగుతుండటం గమనార్హం.

సమూల ప్రక్షాళన అవసరం

అర్హత కలిగిన పట్టణ సహకార బ్యాంకులు చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులుగా స్వచ్ఛందంగా పరివర్తన చెందవచ్చంటూ 2018లో రిజర్వుబ్యాంకు ఓ పథకాన్ని ప్రకటించింది. ఆర్‌.గాంధీ నేతృత్వంలోని అత్యున్నతాధికార కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఈ ప్రకటన చేసింది. వాణిజ్య బ్యాంకులు అందిస్తున్న సేవల్లో చాలావాటిని సహకార బ్యాంకులు కూడా ఇచ్చే అవకాశం ఈ పథకం ద్వారా కలుగుతుంది. ఇలా మార్పు చెందడానికి పట్టణ సహకార బ్యాంకులకు కనీసం రూ.50 కోట్లు ఆపైన నికర విలువను అర్హతగా నిర్దేశించారు.

అయితే, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులుగా మారేందుకు ఈ రంగం నుంచే ప్రతిఘటన ఎదురైంది. ఇలా మారేందుకు వీలుగా మరింత వృద్ధి కోసం భారీ పట్టణ సహకార బ్యాంకులు నిబంధనలకు లోబడి బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ను నియమించాలని రిజర్వుబ్యాంకు సూచించింది. ఉమ్మడి స్టాక్‌ కంపెనీగా మార్కెట్‌ నుంచి పెట్టుబడిని సమకూర్చుకునేందుకు అన్నింటికీ కలిపి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇలా, బలహీన బ్యాంకుల్ని బలమైన వాటితో విలీనం చేయడాన్ని ప్రోత్సహించాలి. ఇతర బ్యాంకులతో పోటీ పడేందుకు సహకార బ్యాంకుల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంచాలి. ఒక భారీ పట్టణ సహకార బ్యాంకులో ఇతర సహకార బ్యాంకుల డిపాజిట్లు జమచేసే అంశాన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంది. డిపాజిటర్ల ప్రయోజనాల్ని, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకొని అంతర బ్యాంకుల డిపాజిట్ల అంశాన్ని పునస్సమీక్షించాల్సిన ఆవశ్యకత ఉంది.

భారతీయ బ్యాంకుల్లో డిపాజిట్ల బీమా మరో ప్రధాన అంశం. ప్రస్తుతం ఒక డిపాజిటర్‌కు లక్ష రూపాయల మేర డిపాజిట్‌కే బీమా సౌకర్యం ఉంది. ఈ అంశంపై పునరాలోచన చేయాల్సి ఉన్నా, ఇది ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉంది. బీమా కవరేజీని భారీగా సమకూర్చినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దక్కదు. బీమాను పెంచడం త్వరగా వివాద పరిష్కారం సూచించే దిశగా రిజర్వుబ్యాంకు, ప్రభుత్వం దృష్టి సారించాలి.

బ్యాంకు డిపాజిట్ల విషయంలో ప్రభుత్వం సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తోంది. బ్యాంకు విఫలమైనప్పుడు డిపాజిటర్‌ నష్టాన్ని భరించాలా అనేది చర్చనీయాంశమే.సహకార రంగంలో ఇటీవలి పరిణామాలు సమగ్రమైన విధివిధానాలను రూపొందించుకునేందుకు అవకాశం కల్పించాయి. సామాన్య మానవుడి పొదుపు సొమ్మును పరిరక్షించే సరైన వ్యవస్థ మనదేశంలో లేనందువల్ల ఇవి అవసరమేనని చెప్పాలి. పకడ్బందీ నియంత్రణల్ని అమలు చేసేందుకు శాసనపరమైన సవరణలు అవసరమా అనే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

సహకార రంగంలో పరిణామాలను రిజర్వుబ్యాంకుతో కలిసి అధ్యయనం చేయాల్సిందిగా తన మంత్రిత్వశాఖ కార్యదర్శులను ఆమె ఆదేశించారు. సవరించాల్సిన చట్టాల గురించి ఈ సమావేశాల్లో చర్చించే అవకాశముంది. ఈ దిశగా రిజర్వుబ్యాంకు, ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటే వినియోగదారుల్లో విశ్వాసం బలపడుతుంది!

ముందున్న మార్గాలు

డిపాజిటర్లు, ఇతర భాగస్వాముల విశ్వాసం చూరగొనేందుకు సహకార బ్యాంకుల నియంత్రణ, పాలన సంబంధిత అంశాలపై పునఃపరిశీలన జరపాల్సిన అవసరం ఉంది. నియంత్రణ సంస్థ అయిన రిజర్వు బ్యాంకు, ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సహకార బ్యాంకుల ప్రాధాన్యాన్ని పునస్సమీక్షించి కుంభకోణాలు పునరావృతం కాకుండా పరిహరించాలి. కొన్ని సహకార బ్యాంకుల్లో పాలన విచ్ఛిన్నమైందనే అభిప్రాయాలున్నాయి. పాలన లోపానికి, సరైన నియంత్రణ లేకపోవడానికి బ్యాంకు బోర్డులు, ఆడిటర్లు, బ్యాంకు యాజమాన్యం, రేటింగ్‌ సంస్థలు, నియంత్రణ వ్యవస్థలే కారణమన్న సంగతి గుర్తించాలి. మంచి పాలనతోనే డిపాజిటర్లలో విశ్వాసం పాదుకొల్పాల్సిన అవసరం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వాలతో రిజర్వు బ్యాంకు అవగాహన ఒప్పందం చేసుకున్నా, ఆయా ప్రభుత్వాలు సరైన నియంత్రణలు అమలు చేయకపోతే- పర్యవేక్షణ ప్రభావం చూపదు. సహకార రుణదాతలు వృత్తి నైపుణ్యంతో పని చేసేలా రిజర్వు బ్యాంకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. బోర్డు డైరెక్టర్లు కాకుండా, తగిన వ్యక్తులతో కూడిన యాజమాన్య బోర్డు కూడా ఉండాలని మలెగం నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సిఫార్సు చేసింది. ఎన్నికైన డైరెక్టర్లకు కాకుండా, వాస్తవిక నిర్వహణపై నియంత్రణ ఈ బోర్డుకు ఉండాలనేది ఈ ఆలోచన వెనకున్న ఉద్దేశం. డైరెక్టర్ల ఎంపికలో మార్పులు తేవాల్సిన అవసరం సైతం ఉంది. ప్రత్యేక పరిజ్ఞానం, వృత్తిపరమైన నిర్వహణ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు బోర్డు సభ్యులుగా ఉండటం ఎంతైనా అవసరం. (రచయిత- సంచాలకులు, ఉపకులపతి ఇందిరాగాంధీ అభివృద్ధి, పరిశోధన సంస్థ)

ABOUT THE AUTHOR

...view details