తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ శాఖ నుంచి మెయిల్​ వచ్చిందా? అయితే జాగ్రత్త!

భారత అంతర్జాలంలో మరోసారి మాల్వేర్​ కలకలం రేపుతోంది. ఆదాయ పన్ను శాఖ పేరిట మోసపూరిత ఈ-మెయిల్స్​తో పన్ను చెల్లిపుదార్ల విలువైన సమాచారాన్ని సేకరిస్తోంది ఈ వైరస్. ఇలాంటి మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయ పన్ను శాఖ అధికారులు, సైబర్​ సెక్యూరిటీ సంస్థలు ఇంటర్నెట్​ వినియోగదారులను హెచ్చరిస్తున్నాయి.

ఐటీ శాఖ నుంచి మెయిల్​ వచ్చిందా? అయితే జాగ్రత్త!

By

Published : Sep 22, 2019, 5:57 PM IST

Updated : Oct 1, 2019, 2:42 PM IST

దేశంలో ఆన్​లైన్​ నేరగాళ్లు హ్యాకింగ్​ కోసం కొత్త దారులు వెతుకుతున్నట్లు ఓ సైబర్​ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఆదాయ పన్ను శాఖ పేరుతో మెయిల్స్ పంపి హ్యాకింగ్​కు పాల్పడుతున్నట్లు ఇంటర్నెట్ యూజర్లను హెచ్చరించింది.

"ఓ మోసపూరిత మాల్వేర్​ సెప్టెంబర్​ 12 నుంచి అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. వ్యక్తులు, ఆర్థిక సంస్థలే లక్ష్యంగా.. ఆదాయ పన్ను శాఖ​ పేరుతో ఈ మాల్వేర్ నకిలీ మెయిల్స్ పంపిస్తోంది."
- ఇండియన్​ కంప్యూటర్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్​ (సీఈఆర్​టీ)

ఇండియన్​ కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్​ దేశ ఇంటర్నెట్ డొమైన్​లో మాల్వేర్​లు, హ్యాకింగ్, ఫిషింగ్​ వంటి కార్యకలాపాలను గుర్తించే సంస్థ.

మాల్వేర్లు ఎలా ఉన్నాయంటే..

మాల్వేర్​ పంపిస్తున్న రెండు రకాల మోసపూరిత మెయిల్స్​ను సీఈఆర్​టీ గుర్తించింది.
వీటిలో.. మొదటి రకం ".img", రెండో రకం ".pif" అనే ప్రమాదకర ఫైళ్లను జోడించి.. incometaxindia[.]info అనే మోసపూరిత డొమైన్​ ద్వారా మెయిల్స్ పంపిస్తున్నట్లు తెలిపింది. ఈ ఫైళ్లు డౌన్​లోడ్ చెసుకోవడం ద్వారా ఆ మాల్వేర్ విలువైన సమాచారాన్ని చోరీ చేసి హ్యాకర్లకు పంపిస్తున్నట్లు పేర్కొంది. అయితే ప్రస్తుతం ఈ ప్రమాదకర డొమైన్​ను నిర్వీర్యం చేసినట్లు సీఈఆర్​టీ వెల్లడించింది.

మాల్వేర్​ పంపే మెయిల్స్ ఎలా ఉన్నాయంటే..

ఇన్​కంటాక్స్ విభాగం నుంచి పంపినట్లు ఉండే కొన్ని మెయిల్స్​ను అవగాహన కోసం వెల్లడించింది సీఈఆర్​టీ.
Income Tax Outstanding Statements A.Y 2017-2018”; Income Tax Statement XML PAN XXX895X.pif; Income Tax Statment XML.img; Income Tax Statement XXX8957X.pif among others.

మాల్వేర్​లతో ఇలా జాగ్రత్త పడండి..

  • ప్రమాదకర మెయిల్స్, ఫైల్స్ వచ్చినట్లు గుర్తిస్తే వాటిని ఎట్టిపరిస్థితుల్లో తెరవద్దు.
  • ఎంఎస్​ ఆఫీస్​లో ఆటోమేటిక్​గా నడిచే విండోలను డిసేబుల్​ చేయాలి.
  • అనుమానిత యూఆర్​ఎల్​లపై క్లిక్​ చేయొద్దు.
  • ఒక వేళ ఏదైనా వాస్తవిక యూఆర్​ఎల్​తో సందేశాలు వస్తే... మెయిల్​ పంపిన సంస్థ వెబ్​సైట్​లోకి వెళ్లి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవాలి.

మాల్వేవేర్ల పట్ల అప్రమత్తం..

ప్రమాదకర మాల్వేర్​ సంచరిస్తున్న నేపథ్యంలో.. ఇంటర్నెట్ యూజర్లు తమ ఫైలింగ్​, రీఫండ్​ సహా ఆదాయపన్ను శాఖతో ఉండే ఇతర సంబంధాలపై అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఐటీ అధికారి ఒకరు సూచించారు.

ఆదాయ పన్ను, బ్యాంకింగ్ వివరాల గురించి ఏవైనా అనుమానించదగ్గ మెయిల్స్ వస్తే.. వాటి నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశంపై అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: పెట్రో​ సెగ: 6 రోజుల్లో ధర ఎంత పెరిగిందో తెలుసా?

Last Updated : Oct 1, 2019, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details