అక్టోబర్ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రయాణికుల వాహనాల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. గతేడాది అక్టోబర్‌లో 2 లక్షల 84 వేల223 యూనిట్లుగా ఉన్న వాహన అమ్మకాలు ఈ అక్టోబర్ నాటికి 0.28 శాతం పెరిగి 2 లక్షల 85 వేల 27 యూనిట్లకు చేరాయి. ఈ మేరకు భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించింది.
బైకుల కంటే కార్ల అమ్మకాలు తక్కువే!
కార్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 6.34 శాతం క్షీణించాయి. 2018 అక్టోబర్‌లో లక్షా 85వేల 400 యూనిట్ల కార్ల అమ్మకాలు జరగ్గా ఈ అక్టోబర్ నాటికి లక్షా 73 వేల 649 యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 15.88 శాతం క్షీణించినట్లు సియామ్ వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌లో 13 లక్షల27 వేల 758 మోటార్ సైకిళ్లు అమ్ముడవగా ఈ అక్టోబర్‌లో 11లక్షల 16 వేల 970 మోటార్ సైకిళ్ల అమ్మకాలు జరిగాయి.
మొత్తంగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే 14.43 శాతం తగ్గినట్లు వివరించింది సియామ్. అక్టోబర్ నెలలో 17లక్షల 57వేల 264 ద్విచక్ర వాహనాలు అమ్ముడైనట్లు తెలిపింది. వాణిజ్య వాహనాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 23.31శాతం శాతం క్షీణించినట్లు తెలిపిన సియామ్ అక్టోబర్‌లో 66 వేల 773 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించింది.