తెలంగాణ

telangana

మార్చిలోపు ఎయిర్​ ఇండియా విక్రయం పూర్తి!

By

Published : Nov 17, 2019, 7:53 PM IST

ఎయిర్ఇండియా సహా భారత్​ పెట్రోలియం సంస్థల విక్రయాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తికావచ్చని అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రూ.58 వేలకోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్​ఇండియాను రుణాల నుంచి గట్టెక్కించేందుకు వాటా విక్రయానికి ప్రభుత్వం గత ఏడాది నుంచే ప్రయత్నాలు చేస్తోంది.

ఎయిర్​ఇండియా

ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్​ ఇండియా విక్రయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎయిర్​ ఇండియా సహా.. ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్‌ పెట్రోలియం విక్రయాలు పూర్తికావచ్చని ఆమె పేర్కొన్నారు.ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు నిర్మల.

ఎయిర్​ఇండియా అమ్మకం ఎందుకంటే..

ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.. ఎయిర్​ ఇండియాకు రూ.58 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంస్థలో 76 శాతం వాటాను విక్రయించాలని గత ఏడాది మార్చిలోనే భావించింది కేంద్రం. అయితే అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్​ఇండియాను కొనుగోలు చేసేందుకు ఏ సంస్థ కుడా ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఆ దిశగా ప్రయత్నం విఫలమైంది.

ఇప్పుడు 100 శాతం విక్రయానికి సిద్ధం..

గతంలో వాటా విక్రయం ప్రణాళిక విఫలమైన నేపథ్యంలో.. ఎయిర్‌ ఇండియాను 100 శాతం ప్రైవేటుపరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ గత ఆగస్టులో ప్రకటించారు. ఎయిర్‌ ఇండియాను సొంతం చేసుకొనేందుకు కొన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గత ఆర్థిక సంవత్సరంలోని నిర్వహణ ఖర్చులో రూ.4,600 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఎయిర్‌ ఇండియా ప్రకటించింది. ఇంధన ధరలు పెరగడం, విదేశీ సర్వీసుల్లో నష్టాలు ఇందుకు కారణమని వెల్లడించింది. అయితే, 2019-20 ఏడాదిలో సంస్థ నిర్వహణపరమైన నష్టాల నుంచి బయటపడే అవకాశముందని సీనియర్‌ అధికారులు గతంలో వెల్లడించారు.

భారత్ పెట్రోలియంలో 53 శాతం ప్రభుత్వ వాటా..

భారత్‌ పెట్రోలియంలోనూ ప్రభుత్వానికున్న 53.29 శాతం వాటాను విక్రయించేందుకు సంస్థ సెక్రటరీల బృందం అక్టోబరులోనే అంగీకరించింది. ఈ సంస్థ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.1.02 లక్షల కోట్లు. ఇందులో ప్రభుత్వ వాటా విలువ.. సుమారు రూ.65 వేల కోట్లు.

ఇదీ చూడండి: రియల్​ మీ '5ఎస్​' x వివో 'యూ20'.. ఏది​ బెస్ట్​?

ABOUT THE AUTHOR

...view details