తెలంగాణ

telangana

ETV Bharat / business

అదిగో నవలోకం... అవుతుంది నీ సొంతం!

గత దశాబ్దంలో ఎన్నో మార్పులు మనం చూశాం. స్మార్ట్​ఫోన్లతో ప్రపంచానే చూడటం.. ఇంట్లో నుంచే షాపింగ్ చేయడం.. ఇలాంటి సదుపాయాలు ఎన్నో మనకు గత 10 ఏళ్లలో చాలా దగ్గరయ్యాయి. ఇప్పుడు నవ దశాబ్దం ప్రారంభమైంది. రానున్న 10 ఏళ్లలో మనకు చేరువకానున్న మరికొన్ని సాంకేతికతలు ఏంటో ఓ సారి చూసొద్దాం రండి!

TECHNOLOGY
అదిగో నవలోకం అవుతుంది నీ సొంతం!

By

Published : Jan 1, 2020, 1:05 PM IST

ప్రజల జీవితాల్ని మరింత సౌకర్యవంతం, సుఖమయం చేసే లక్ష్యంతో రాబోయే దశాబ్ద కాలంలో పలు సాంకేతిక ఆవిష్కరణలు చోటుచేసుకోబోతున్నాయి. మున్ముందు మనం ఎలా జీవిస్తాం.. పనిచేస్తాం.. మనల్ని మనం ఏ విధంగా సంతోషపెట్టుకుంటాం అనే విషయాలను ఈ సాంకేతిక విప్లవం ప్రభావితం చేయబోతోంది. అలాంటి ఆవిష్కరణలు కొన్ని...

ఎగిరే కార్లు

రాబోయే దశాబ్దిలో గాల్లో ఎగిరే కార్లు రాబోతున్నాయి. ‘ఉబర్‌ ఎలివేట్‌ ప్రోగ్రాం’ పేరుతో ఉబర్‌ టెక్నాలజీస్‌ సంస్థ వీటిపై పెద్దఎత్తున ప్రయోగాలు చేస్తోంది. ‘ఉబర్‌ ఎయిర్‌’ అనే ఈ ఎలక్ట్రిక్‌ వాహనం భూమిపై నుంచి నిట్టనిలువుగా గాల్లోకి లేస్తుంది. అమెరికాలోని డాలస్‌, లాస్‌ ఏంజెలిస్‌లలో ప్రాథమిక పరీక్షల తర్వాత మూడో పరీక్షను భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌లలో ఎక్కడో ఒకచోట నిర్వహించాలని ఉబర్‌ ఆలోచిస్తోంది.

ఎగిరే కార్లు

హైపర్‌ లూప్‌

ప్రపంచ సంపన్నుడు ఎలన్‌మస్క్‌ తెరపైకి తెచ్చిన హైపర్‌లూప్‌ సిస్టమ్‌ను మొదట వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవడానికి కనీసం మూడు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసే భారీ గొట్టపు మార్గం గుండా ఎలాంటి రాపిడి లేకుండా వాహనం అత్యంతవేగంగా దూపుకువెళుతుంది. భవిష్యత్తులో రైలు, రోడ్డు సహా అన్ని రవాణా నెట్‌వర్క్‌లు అనేక సెన్సర్లతో అనుసంధానమవుతాయి. దీనివల్ల వాహనాలు పరస్పరం సంభాషించుకునే పరిస్థితులు వస్తాయి. భూమ్యాధార దూర ప్రయాణ సాధనంగా మాగ్లెవ్‌(అయస్కాంత శక్తితో పనిచేసేవి) రైళ్లు అందుబాటులోకి వస్తాయి.

హైపర్‌ లూప్‌

ఆనందమయ షాపింగ్‌

ఆనందమయ షాపింగ్‌ కోసం సరికొత్త సాంకేతికతలు అందుబాటులోకి రానున్నాయి. ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌ అమెరికాలో ‘అమెజాన్‌ గో’ పేరుతో దుకాణాల చైన్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఇవి సియాటెల్‌, షికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌ నగరాల్లో పనిచేస్తున్నాయి. ఇందులో బిల్లు కౌంటర్లు, క్యాషియర్లు లాంటి వారు ఉండరు. దుకాణం నిండా లెక్కకు మిక్కిలి సీసీ కెమెరాలుంటాయి. మనం దుకాణం లోపలికి ప్రవేశించి.. నచ్చిన వస్తువును తీసుకుని బయటికి వచ్చేయెచ్చు. అలా వచ్చిన రెండు నిముషాల్లో మన మొబైల్‌కు బిల్లు వస్తుంది. దీనివల్ల ప్రవేశాల దగ్గర తనిఖీలు, బయటికి వెళ్లేటపుడు బిల్లింగ్‌లాంటి తలనొప్పులుండవు. కంప్యూటర్‌ డేటా సాయంతో.. వినియోగదారుల నుంచి దుకాణ సిబ్బంది రియల్‌టైమ్‌ ఫీడ్‌బ్యాక్‌ను తీసుకునేలా ఏఐ పరికరాల్ని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న క్యాపిలరీ టెక్నాలజీస్‌ అభివృద్ధిచేసింది. దీనివల్ల తాము చేసిన షాపింగ్‌పై అనుభూతిని చెప్పడానికి వినియోగదారులకు మరింత సులువవుతోంది. రాబోయే పదేళ్లలో మెషిన్‌ అధ్యయన సాంకేతిక పరిజ్ఞానాలు మరింతగా అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఆర్డర్లు, చెల్లింపులు వాటంతటవే జరిగిపోతాయి.

ఆనందమయ షాపింగ్‌

మొబైల్‌ స్మార్ట్‌ విప్లవం

మొబైల్‌ ఫోన్‌లోనే త్రీడీ సినిమాలను చూసే రోజులొస్తాయి. అన్ని స్మార్ట్‌ఫోన్లలోనూ ‘హోలోగ్రాఫిక్‌ డిస్‌ప్లే(అచ్చంగా థియేటర్లో సినిమా చూసిన త్రీడీ గ్రాఫిక్‌ చిత్రాల అనుభూతి) సర్వసాధారణం అవుతుంది. మొబైల్‌లో గేమింగ్‌కు ఉపయోగపడే గ్రాఫిక్‌ చిప్స్‌ ఎంతో శక్తిమంతం కానున్నాయి. మున్ముందు మొబైల్‌ఫోన్లు, వాటి యజమానులు ఎక్కడున్నా.. గుర్తించగలిగే డిజిటల్‌ కమ్యూనికేషన్‌ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. కొన్ని వారాల పాటు ఛార్జింగ్‌ నిలువ ఉండే మొబైల్‌ బ్యాటరీలు, సౌరశక్తి బ్యాటరీలను అభివృద్ధి చేస్తున్నారు. ఎంచక్కా కార్యాలయంలో కూర్చుని మొబైల్‌ ద్వారా స్మార్ట్‌ హోంతో అనుసంధానం కావొచ్చు. అక్కడి నుంచే సంకేతాలు పంపుతూ ఇంట్లోని ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా పనుల్ని చక్కబెట్టొచ్చు.

ఇంట్లోనే ఆసుపత్రి

మున్ముందు చికిత్సల కోసం ఆసుపత్రికి వెళ్లకుండా.. ఆసుపత్రే మీ ఇంటికి వచ్చే రోజులు రాబోతున్నాయి. ఉదాహరణకు చిన్నచిన్న స్కానింగ్‌ యంత్రాలను వివిధ స్టార్టప్‌లు, కంపెనీలు తయారుచేస్తున్నాయి. వాటిని ఇంటికే తెచ్చుకోవచ్చు. రోగుల్ని నిరంతరం పర్యవేక్షించే, వారి డేటాను ఎలక్ట్రానిక్‌ రికార్డుల్లోకి సురక్షితంగా అప్‌లోడ్‌ చేసే సాధనాలు ఇప్పటికే ఆచరణలోకి వచ్చాయి. వాటి ఆధారంగా డాక్టర్లు రోగి పరిస్థితిని ఆసుపత్రి నుంచి పర్యవేక్షించి.. తగిన సలహాలు ఇస్తారు. రోగులు వాటిని ఇంటి నుంచి పాటిస్తే చాలు. కేవలం ఒకే ఒక్క స్కాన్‌తో రోగి శరీర పరిస్థితి మొత్తాన్నీ డాక్టర్లు అంచనావేసే పరిస్థితులు రాబోతున్నాయి.

మొబైల్‌ స్మార్ట్‌ విప్లవం

ఇదీ చూడండి:'2020లో ఉత్తమ పెట్టుబడులు పెడదాం ఇలా'

ABOUT THE AUTHOR

...view details