ప్రస్తుత పోటీ ప్రపంచంలో అధునాతన సాంకేతికత అందరికీ అందుబాటులోకి వస్తోంది. అసాధ్యమనుకున్నవీ సుసాధ్యం చేసే వీలుగా కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు ఉద్యోగుల పనితీరు, స్వీయ విశ్లేషణ అంచనా వేసి.. ఉత్తమ ఫలితాల్ని రాబట్టే విధంగా ఓ యాప్ రాబోతుంది. ఈ మొబైల్ టూల్‌తో వ్యక్తుల్ని అంచనా వేయొచ్చు. సెన్సింగ్ వ్యవస్థ ద్వారా 80 శాతం కచ్చితత్వంతో ఉద్యోగి పనితీరును కనిపెట్టేయవచ్చు. స్మార్ట్ఫోన్లతో పాటు.. ఫిట్నెస్ బ్రేస్లెట్లలోనూ ఇది అందుబాటులోకి రానుంది.
ఫిట్నెస్ బ్యాండ్లతో... గుండె పనితీరు, నిద్ర, ఒత్తిడి, బరువు, కేలరీల వినియోగం వంటి వాటిని అంచనా వేయొచ్చు.
ప్రస్తుతం పరిశీలన దశలో ఉందీ పరికరం. ఇప్పటికే ఐటీ, మేనేజ్మెంట్ వంటి వివిధ రంగాల్లోని ఉద్యోగులపై ఈ మొబైల్ టూల్‌ను ప్రయోగించి విజయవంతమయ్యారు. వారి పనితీరును నివేదించి... మెరుగైన ఫలితాల్ని రాబట్టింది. ఇందుకోసం.. ఉద్యోగ ప్రదేశంలో ఎంత సమయం కేటాయిస్తున్నారు.. నిద్రా సమయం, శారీరక ఒత్తిడి, ఫోన్ వినియోగం వీటన్నింటినీ పరిశీలించింది.
మానసిక ప్రవర్తన, భావోద్వేగాలు, ఒత్తిడిని అధిగమించడం.. వంటివి పరిశీలించి ఉత్తమ, సాధారణ ఉద్యోగులుగానూ వర్గీకరించవచ్చు. తదనంతర కార్యాచరణతో.. మెరుగైన ఫలితాల్ని రాబట్టవచ్చు.