డిజిటల్ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు వీలుగా నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్) లావాదేవీల్ని 24 గంటలూ కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి ఖాతాదారులు ఈ సేవల్ని రోజంతా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఒకవేళ బ్యాంకులకు సెలవులున్నా, ఈ సేవను వాడుకోవచ్చని పేర్కొంది.
ఇప్పటివరకు నెఫ్ట్ లావాదేవీలను గంటకోసారి (అవర్లీ బ్యాచెస్) సెటిల్ చేస్తున్నారు. మామూలు రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, మొదటి, మూడో శనివారాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విడతల వారీగా నెఫ్ట్ లావాదేవీలను సెటిల్ చేస్తున్నారు. డిసెంబరు 16 నుంచి ఈ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మొదటి సెటిల్‌మెంట్ డిసెంబరు 16వ తేదీ 00:30 గంటల తర్వాత (డిసెంబరు 15 రాత్రి) ప్రారంభమవుతుంది.