తెలంగాణ

telangana

ETV Bharat / business

అంబానీ వేతనం వరుసగా 11 ఏటా అంతే! - వేతనం

వరుసగా 11వ ఏట తన వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. రిలయన్స్​ గ్రూప్​ ఛైర్మన్ హోదాలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.24 కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా రూ.15 కోట్లు మాత్రమే తీసుకుంటానని కంపెనీ బోర్డును కోరారు.

ముకేశ్ అంబానీ

By

Published : Jul 20, 2019, 1:09 PM IST

భారత అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా 11వ ఏట వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. 2008-09 నుంచి రూ. 15 కోట్ల వేతనాన్నే తీసుకుంటున్నారు ఈ దిగ్గజ వ్యాపారవేత్త.

ఛైర్మన్ హోదాలో జీత భత్యాలు, ఇతర అలవెన్సులు, కమీషన్లు మొత్తం కలిపి రూ.24 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. అయితే ఆ వేతనాన్ని ముకేశ్ స్వచ్ఛందంగా వదులుకున్నారు. ముకేశ్ అంబానీ బంధువు నిఖిల్ సహా ఇతర శాశ్వత డైరెక్టర్ల వేతనాలు మాత్రం 2019 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి భారీగా పెరిగాయి.

"కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ రూ. 15 కోట్ల వార్షిక వేతనం కోరుకున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారి వేతనాలు మితంగా ఉండాలన్న ఆలోచనకు తానే ఓ ఉదాహరణగా నిలిచేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు."
--- రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక నివేదిక

ముకేశ్ అంబానీ 2018-19లో రూ.4.45 కోట్ల జీతం, భత్యాలు తీసుకున్నారు. అంతకు క్రితం ఏడాదితో పోల్చుకుంటే ఈ మొత్తం తగ్గడం గమనార్హం. 2017-18లో ఆయన రూ.4.49 కోట్ల జీతభత్యాలు అందుకున్నారు. కమీషన్​ రూ.9.53 కోట్లలో ఎలాంటి మార్పులేదు. ఇతర భత్యాలు రూ.27 లక్షల నుంచి రూ.31 లక్షలకు పెరిగాయి. పదవీ విరమణ ప్రయోజనాలు రూ.71 లక్షలుగా ఉన్నాయి.

డైరెక్టర్ల వేతనాల్లో వృద్ధి

అంబానీ బంధువులు, కంపెనీ డైరెక్టర్లు అయిన నిఖిల్ ఆర్ మేశ్వానీ, హితాల్ ఆర్ మేశ్వానీల వేతనాలు 2018-19లో రూ.20.57 కోట్లకు పెరిగాయి. వారిద్దరూ 2017-18లో రూ.19.99 కోట్లు వేతనం తీసుకున్నారు.

కంపెనీ ప్రధాన డైరెక్టర్లలో ఒకరైన పీ.ఎం.ఎస్​ ప్రసాద్ వేతనం 2018-19లో రూ.10.01 కోట్లకు పెరిగింది. 2017-18లో ఆయన వేతనం రూ.8.99 కోట్లుగా ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్లు​ (ముకేశ్ సతీమణి నీతా అంబానీతో కలిపి) గత ఆర్థిక సంవత్సరానికి రూ.1.65 కోట్ల కమీషన్ పొందారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఈ మొత్తం రూ. 1.5 కోట్లుగా ఉంది.

2018 అక్టోబర్​ 17న రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు సభ్యురాలిగా నియమితురాలైన ఎస్​బీఐ మాజీ ఛైర్​పర్సన్​ అరుంధతి భట్టాచార్య రూ.75 లక్షల కమీషన్ పొందినట్లు ఆ సంస్థ పేర్కొంది.

ఇదీ చూడండి: రిలయన్స్ లాభాలు అదుర్స్.. జియో వాటా 891 కోట్లు

ABOUT THE AUTHOR

...view details