తెలంగాణ

telangana

ETV Bharat / business

'భారత్​మాలా'కు ఎల్​ఐసీ రూ. 1.25 లక్షల కోట్ల  రుణం - నితిన్ గడ్కరీ

దేశవ్యాప్తంగా హైవే గ్రిడ్ నిర్మించేందుకు తలపెట్టిన 'భారత్​మాలా' ప్రాజెక్టు కోసం ఎల్​ఐసీ రూ.1.25 లక్షల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు.

నితిన్ గడ్కరీ

By

Published : Jul 21, 2019, 4:41 PM IST

Updated : Jul 21, 2019, 5:35 PM IST

భారత్​లో మౌలిక సదుపాయాల నిర్మాణానికి వినూత్న పద్ధతిలో రుణాన్ని ఇచ్చేందుకు బీమా దిగ్గజం ఎల్​ఐసీ అంగీకరించినట్లు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు. ఇందులో భాగంగా 2024 నాటికి రూ.1.25 లక్షల కోట్ల రుణం ఇవ్వనుందని పేర్కొన్నారు.

'భారత్​మాలా' పేరుతో దేశవ్యాప్తంగా హైవే గ్రిడ్​ను నిర్మించనుంది ప్రభుత్వం. ఇందుకోసం రూ. 8.41 లక్షల కోట్ల వ్యయాన్ని అంచనా వేస్తోంది.

"ఏడాదికి రూ.25,000 కోట్ల చొప్పున.. ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్లు ఇచ్చేందుకు ఎల్​ఐసీ ప్రాథమిక అంగీకారం తెలిపింది. మేము ఈ నిధులను హైవేల నిర్మాణానికి వినియోగిస్తాం." - నితిన్ గడ్కరీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి

భారత్ మాలా ప్రాజెక్టును మొదట రూ. 5.35 లక్షల కోట్లతో పూర్తి చేయాలని భావించింది ప్రభుత్వం. అయితే భూ సేకరణలో ఖర్చులు పెరగటం కారణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది.

మొదటి దశలో 34,800 కిలో మీటర్ల మేర జాతీయ రహదార్లు అప్​గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ఇందులో ఇంకా 10,000 కిలో మీటర్ల మేర రహదార్లను అప్​గ్రేడ్ చేయాల్సి ఉంది.

భారత్​ మాలా ప్రాజెక్టు కోసం పన్నులు, టోల్ ఆదాయం, రుణాలు, ప్రైవేట్ భాగస్వామ్యం, బీమా, పెన్షన్ ఫండ్​ల ద్వారా నిధులు సమకూర్చుకోనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సామాన్యుడి ఇంటి కరెంటు బిల్లు రూ.128 కోట్లు!

Last Updated : Jul 21, 2019, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details