తెలంగాణ

telangana

ETV Bharat / business

రానున్న 3 నెలలు ఉద్యోగ కల్పన అంతంతమాత్రమే!

ఈ ఏడాది చివరి మూడు నెలలు.. ఉద్యోగులను పెంచుకునేందుకు దేశీయ కంపెనీలు అంతగా ఆసక్తి చూపడం లేదని ఓ సర్వే వెల్లడించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, బ్రెగ్జిట్​, సుంకాల యుద్ధం వంటివి ఇందుకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది.

ఉద్యోగాలు

By

Published : Sep 10, 2019, 5:36 PM IST

Updated : Sep 30, 2019, 3:41 AM IST

ఈ ఏడాది చివరి మూడు నెలలు.. దేశంలో ఉద్యోగ కల్పన అంతంత మాత్రంగానే ఉండొచ్చని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రముఖ అంతర్జాతీయ పరిశోధన సంస్థ మ్యాన్​పవర్​ గ్రూప్​ వెల్లడించిన 'ఉద్యోగకల్పన ముఖచిత్రం'లో పలు కీలక విషయాలు తెలిశాయి.

దేశవ్యాప్తంగా 5,131 కంపెనీలపై జరిపిన ఈ సర్వేలో 19 శాతం కంపెనీలు మాత్రమే.. ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్​ మధ్య కాలంలో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు తెలిపాయి. అత్యధికంగా 52 శాతం సంస్థలు ఉద్యోగాల సృష్టి ఉండదని పేర్కొన్నాయి. మిగతా 28 శాతం కంపెనీలు ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

నాలుగో స్థానంలో భారత్​

ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఏడాది చివరి మూడు నెలల్లో ఉద్యోగకల్పన విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇదే సమయంలో జపాన్​లో 25 శాతం కంపెనీలు ఉద్యోగ కల్పనకు ఆసక్తి చూపుతున్నాయి. తైవాన్​లో 21 శాతం కంపెనీలు.. అమెరికాలో 20 శాతం సంస్థలు ఉద్యోగ కల్పనకు మొగ్గుచూపుతున్నట్లు సర్వే తెలిపింది.

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, బ్రెగ్జిట్, సుంకాల ప్రభావం ఉద్యోగ కల్పన తగ్గడానికి కారణంగా సర్వే తెలిపింది.

ఈ దేశాల్లో చాలా తక్కువ...

ఈ ఏడాది చివరి మూడు నెలల్లో.. స్పెయిన్​లోని కంపెనీలు ఉద్యోగ కల్పనకు అసలు ఆసక్తి చూపడం లేదని సర్వేలో తేలింది. చెక్​ రిపబ్లిక్​లో 2 శాతం, అర్జెంటీనా, కోస్టారికా, స్విట్జర్​ల్యాండ్​లో 3 శాతం చొప్పున మాత్రమే కంపెనీలు ఉద్యోగాలు కల్పించేందుకు మొగ్గుచూపుతున్నట్లు సర్వే పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి

ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల్లోని 59,000 కంపెనీలపై జరిపిన సర్వేలో 15 దేశాల కంపెనీలు ఉద్యోగకల్పనకు అధికంగా ఆసక్తి చూపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. 23 దేశాల్లో అతి తక్కువ ఉద్యోగకల్పన ఉంటుందని, ఆరు దేశాల్లో ఉద్యోగాల్లో పెద్దగా మార్పు ఉండదని వెల్లడైంది.

ఇదీ చూడండి: గూగుల్​కు చిక్కులు- 'గుత్తాధిపత్యం'పై 50 రాష్ట్రాల దర్యాప్తు

Last Updated : Sep 30, 2019, 3:41 AM IST

ABOUT THE AUTHOR

...view details