తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకులు దివాలా తీస్తే.. ఆర్బీఐ ఆదుకోవాల్సిందే!

దేశంలో బ్యాంక్​ మోసాలు నానాటికి ఎక్కువవుతున్నాయి . బ్యాంకులిచ్చే భారీ రుణాలు కుంభకోణాల్లో చిక్కుకోవడం వల్ల వాటి ప్రభావం సాధారణ డిపాజిటర్లపై పడుతోంది. ఇలాంటి సమస్యలకు ఆర్బీఐ పరిష్కారం కనుక్కోవడం సహా.. డిపాజిటర్లనూ ఆదుకోవాలని డిమాండ్​ పెరిగిపోతోంది. ఇటీవల జరిగిన పీఎమ్​సీ బ్యాంకు కుంభకోణంతో ఈ డిమాండ్​ మరింత ఎక్కువైంది. ఈ అంశంపై నిపుణుల విశ్లేషణ మీ కోసం.

RBI
రిజర్వు బ్యాంకే ఆదుకోవాలి

By

Published : Dec 7, 2019, 7:11 AM IST

ఏదైనా బ్యాంకు దివాలా తీయగానే భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఆదరాబాదరాగా రకరకాల చర్యలు తీసుకుంటుంది.ఆ పనేదో దివాలాకు ముందే చేసిఉండొచ్చు కదా, సంక్షోభాలు తలెత్తక ముందే నివారణ చర్యలు తీసుకోవచ్చు కదా అనే ప్రశ్నలు అందరి నోటా వినవస్తాయి. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంక్‌ (పీఎమ్‌సీ) ఇటీవల కుప్పకూలిపోవడం కారణంగా దాదాపు డజనుమంది డిపాజిటర్లు ఆత్మహత్యలు చేసుకున్నాక ఈ ప్రశ్నలు మరింతగా మార్మోగాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఆర్‌బీఐ తీసుకునే చర్యల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండటం లేదు. మాధవ్‌పురా మర్కంటైల్‌ కోపరేటివ్‌ బ్యాంకు (ఎమ్‌ఎమ్‌సీ) 2001లో దివాలా తీసిన తరవాత ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు, ఆ తరవాత అటువంటి వైఫల్యాలు జరగకుండా ఏమాత్రం నిరోధించలేకపోయాయి.

నేర్వని పాఠాలు

2005లో దేశంలో 1,926 పట్టణ సహకార బ్యాంకులు (యూసీబీలు) ఉండగా, 2018 వచ్చేసరికి వాటి సంఖ్య 1,551కి తగ్గిపోయిందంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్‌ఎమ్‌సీ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం, యూసీబీలు స్థాపిత లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేట్లు జాగ్రత్తపడకపోవడం వల్లే- పీఎమ్‌సీ దివాలాను రిజర్వు బ్యాంకు నిలువరించలేకపోయింది. పట్టణ సహకార బ్యాంకులు (యూసీబీ) నిబంధనల ప్రకారం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించకూడదు. అయినా ఇంతకాలం ఆర్‌బీఐ పట్టించుకోకపోవడం వల్లే పీఎమ్‌సీ, ఎమ్‌ఎమ్‌సీ వంటి యూసీబీలు డిపాజిటర్లను నట్టేట ముంచగలిగాయి. తీరా ఇప్పుడు పటిష్ఠమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పరచి డిపాజిట్‌దారుల ప్రయోజనాలను కాపాడతామని గర్జించడం వల్ల ఏం ఉపయోగం? 1984లో ముంబయిలో ఒకే ఒక కార్యాలయంతో ప్రారంభమైన పీఎమ్‌సీ క్రమంగా ఏడు రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, దిల్లీ, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌) 137 శాఖలను తెరిచింది. దేశంలోని 10 అగ్ర సహకార బ్యాంకుల్లో ఒకటైన పీఎమ్‌సీ మూలధన నిష్పత్తి రిజర్వు బ్యాంకు నిర్దేశించినదానికన్నా ఎక్కువే ఉంది. 2019 మార్చినాటికి రూ.11,617 కోట్ల డిపాజిట్లు ఉండగా, అది ఇచ్చిన రుణాలు రూ.8,383 కోట్లకు చేరాయి. 2018-19లో రూ.100 కోట్ల లాభం చూపింది కూడా. ఇతర వాణిజ్య బ్యాంకులకన్నా దాని నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) తక్కువే. ఆడిటర్లు దానికి ‘ఏ’ రేటింగ్‌ ఇచ్చారు. పీఎమ్‌సీ గెలుచుకున్న అవార్డులు, ప్రశంసా పత్రాలను జాబితా రాయడానికి ఇక్కడ స్థలం చాలదు. ఇదంతా కపట నాటకమని పీఎమ్‌సీ అంతర్గత వర్గాల ద్వారా ఆర్‌బీఐకి తెలిసింది. పీఎమ్‌సీ పైకి ఎన్ని గొప్పలు చెప్పుకొన్నా, అది ఇచ్చిన రుణాల్లో 70 శాతం నిరర్థక ఆస్తులేనని ఆర్‌బీఐ తనిఖీలో తేలింది. హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీఐఎల్‌) అనే ఒకే ఒక్క సంస్థకు రూ.4,635 కోట్ల రుణమిచ్చింది. 21,049 బోగస్‌ ఖాతాల ద్వారా ఆ సంస్థకు రుణాలు ముట్టజెప్పింది. పీఎమ్‌సీ బండారం బట్టబయలు కాగానే ఆర్‌బీఐ రాబోయే ఆరు నెలలపాటు ఖాతాదారులు వెయ్యి రూపాయలకు మించి వెనక్కు తీసుకోరాదని (విత్‌ డ్రా) సెప్టెంబరు 24న ఉత్తర్వు జారీ చేసిన నేపథ్యంలో.. డిపాజిట్‌దారులు నిశ్చేష్టులయ్యారు. తరవాత ఆ పరిమితిని క్రమక్రమంగా పెంచడం వేరే సంగతి. ఆర్‌బీఐ, సహకార సంఘాల కేంద్రీయ రిజిస్ట్రార్‌ల అజమాయిషీలో పనిచేస్తాయనుకున్న యూసీబీలు డిపాజిటర్లను ఇంతలా ఎలా వంచించగలిగాయనే ప్రశ్న అంతటా వినవస్తోంది. దేశంలో రకరకాల బ్యాంకులు అనేకం ఉన్నప్పుడు వాటిలో ఏది భద్రమో తెలుసుకునే వెసులుబాటు ప్రజలకు ఉండదు. మోసకారి బ్యాంకులు ఉనికిలోకి రాకుండా జాగ్రత్త వహించాల్సిన ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించడం లేదు. 130 కోట్ల పైచిలుకు జనాభాగల భారతదేశంలో 1,45,871 వాణిజ్య బ్యాంకు కార్యాలయాలు ఉన్నాయి. ఇవి మన అవసరాలకు ఏమాత్రం చాలవు. దేశంలోని ఆరు లక్షల పైచిలుకు గ్రామాల్లో కేవలం 51,686 బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఒకప్పుడు మొత్తం బ్యాంకు శాఖల్లో గ్రామీణ శాఖలు 58.20 శాతం. ఇప్పుడవి 35.43 శాతానికి తగ్గిపోయాయి.

భారతదేశంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), దాని అనుబంధ బ్యాంకులు, ఇతర జాతీయ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్థానిక ప్రాంత(లోకల్‌ ఏరియా) బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, చెల్లింపుల బ్యాంకులను కలిపి వాణిజ్య బ్యాంకులు అంటారు. ఇవికాకుండా 98,163 సహకార బ్యాంకు శాఖలు ఉన్నాయి. వీటిలో 96,612 శాఖలు గ్రామాల్లో ఉన్నాయి. మిగిలిన 1,551 షెడ్యూల్డ్‌, నాన్‌ షెడ్యూల్డ్‌ పట్టణ సహకార బ్యాంకు (యూసీబీ) శాఖలే. డిపాజిటర్లకు రక్షణగా బ్యాంకులపై రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) పలు నియంత్రణలు విధించింది. డిపాజిట్‌ మొత్తాల్లో కొంత భాగాన్ని నగదు రూపంలో, ప్రభుత్వ బాండ్లలో, ఇతర సెక్యూరిటీల్లో భద్రపరచాలని ఆదేశించింది. దీన్ని చట్టబద్ధ లిక్విడిటీ నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌) అంటారు. ఈ నిష్పత్తి ఇప్పుడు 18.5 శాతం. 1990లోనైతే అది ఏకంగా 38.5 శాతంగా ఉండేది. ఎస్‌ఎల్‌ఆర్‌ను 40 శాతం వరకు పెంచే అధికారం రిజర్వు బ్యాంకుకు ఉంది. ఇది కాకుండా నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) రూపంలో మరికొంత నగదును భద్రపరచాలని బ్యాంకులను ఆదేశిస్తుంది. 1991లో 15 శాతంగా ఉన్న సీఆర్‌ఆర్‌ ఇప్పుడు నాలుగు శాతమే. ఇంకా స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ నుంచి పనిచేసే బ్యాంకింగ్‌ పర్యవేక్షణ సంఘం నిర్దేశించిన పరిమితి ప్రకారం అన్ని బ్యాంకులు సొంత పెట్టుబడి కలిగిఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆ పరిమితికి మించి పెట్టుబడులు ఉండాలనీ ఆర్బీఐ నిర్దేశిస్తుంది. రుణ మంజూరు, వసూలుకు కచ్చితమైన ప్రమాణాలు విధిస్తుంది. ఈ ప్రమాణాలన్నింటినీ సక్రమంగా పాటిస్తే డిపాజిట్‌దారుల సొమ్ముకు గట్టి పూచీకత్తు ఉంటుంది. ఈ సందర్భంగా అన్ని వాణిజ్య బ్యాంకుల్లోని డిపాజిట్లు రూ.125,73,772 కోట్లని గమనించాలి. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 66 శాతానికి సమానం. 2017 మార్చి చివరకు అన్ని గ్రామీణ సహకార బ్యాంకుల్లో రూ.5.72 లక్షల కోట్ల డిపాజిట్లు ఉండగా, అవి రూ.6.17 లక్షల కోట్ల మేరకు రుణాలు ఇచ్చాయి. వాటి నిరర్థక ఆస్తుల (ఎన్పీఏల) విలువ రూ.95 వేల కోట్ల పైచిలుకు. అన్ని గ్రామీణ సహకార బ్యాంకుల ఎన్పీఏలు 15.41 శాతం. రాష్ట్ర సహకార బ్యాంకులకు ఇవి 26.6 శాతం వరకు ఉన్నాయి. 2018 ఆర్థిక సంవత్సరాంతానికి అన్ని పట్టణ సహకార బ్యాంకుల (యూసీబీ) డిపాజిట్లు రూ.4.56 లక్షల కోట్లయితే, అవి ఇచ్చిన రుణాలు రూ.2.80 లక్షల కోట్లు. పీఎమ్‌సీ వైఫలయంతో అసలు పట్టణ సహకార బ్యాంకులు డిపాజిట్లు స్వీకరించడానికి అనుమతించాలా వద్దా అనే ప్రశ్న తలెత్తింది.

దొడ్డిదోవన ప్రవేశం

కొంతమంది అతి తెలివిపరులు సహకార సంఘాన్ని ఏర్పరచి, తరవాత దాన్ని పట్టణ సహకార సంఘం (యూసీబీ)గా మార్చడం ద్వారా బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. పెరటి దోవన ప్రవేశమంటే ఇదే. వాణిజ్య బ్యాంకు స్థాపనకు ఆర్బీఐ నుంచి అనుమతి సంపాదించడం తేలిక కాదు కాబట్టి సహకారం పేరిట చొరబడుతున్నారు. సహకార బ్యాంకుల విస్తరణ వల్ల జనాభాలో ఎక్కువమందికి బ్యాంకింగ్‌ సౌకర్యం లభిస్తుందనో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల సేవలు విస్తరిస్తాయనో ప్రభుత్వం, ఆర్బీఐలు ఈ వ్యవహారాన్ని లోపాయికారీగా అనుమతిస్తున్నాయి. దీంతో మోసగాళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆర్బీఐ ప్రమాణాలన్నింటినీ తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని బురిడీ కొట్టిస్తున్నారు. వీరి అకృత్యాలను ఆర్బీఐ కాని, ఆడిటర్లు కానీ పసిగట్టేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఆర్బీఐ ఇకనైనా మేలుకోవాలి. సహకార బ్యాంకులు డిపాజిట్లు స్వీకరించడంపై నియంత్రణలు విధించాలి. కొత్త తరహా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏదైనా బ్యాంకు కుప్పకూలితే ఖాతాదారులకు డిపాజిట్‌ బీమా, రుణ భరోసా సంస్థ నుంచి లక్ష రూపాయల వరకు బీమా సొమ్ము ఇస్తున్నారు. ఇది ఏమూలకూ చాలదు. డిపాజిటర్లకు మొత్తం నగదును వాపసు ఇప్పించాలి. పట్టణ సహకార బ్యాంకులకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం, ఆర్బీఐలే కాబట్టి డిపాజిట్‌దారులు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యతను తామే స్వీకరించాలి. పట్టణ సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు చేయవద్దని ప్రజలను హెచ్చరించడంలో ఆర్బీఐ విఫలమైంది కాబట్టి వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి తానే పూనుకోవాలి.

‘సహకారం. పుట్టిన విధం...

ఇంగ్లాండ్‌లో 28 మంది నేత కార్మికులు 1844లో ప్రపంచంలో మొట్టమొదటి సహకార సంఘం నెలకొల్పినప్పటి నుంచి సభ్యుల పరస్పర ప్రయోజనార్థమే సహకార సంఘాలు పనిచేయాలన్న నిబంధన పాటించేవారు. స్వచ్ఛంద సభ్యత్వం, ప్రజాతంత్ర పద్ధతుల్లో సభ్యుల చేతికి నియంత్రణాధికారం, స్వయంసహాయక పంథా, స్వతంత్ర కార్యాచరణ వంటి విలువలను, సంప్రదాయాలను సహకార సంఘాలు పాటించేవి. ఏతావతా సభ్యుల ప్రయోజనం కోసం ఏర్పడిన సహకార సంఘాలు బయటివారి నుంచి డిపాజిట్లు స్వీకరించడం సబబు కాదు. అవి తమ సొమ్ముతో తమ హితం కోసం సహకార పద్ధతిలో పనిచేయాలి. వాస్తవంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. పట్టణ, గ్రామీణ సహకార సంఘాలన్నీ ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తున్నాయి. ఇటీవల కుప్పకూలిన పీఎమ్‌సీ బ్యాంకులో 2019 మార్చినాటికి 51,601మంది సభ్యులు ఉండగా, అందులో సభ్యులుకాని 16 లక్షలమంది నుంచి అది డిపాజిట్లు స్వీకరించింది.

ఇదీ చూడండి:అలా అయితే వొడాఫోన్-ఐడియా మూసివేతే: బిర్లా

ABOUT THE AUTHOR

...view details