ఐడీబీఐ బ్యాంకు పేరు మార్చలేమని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకులో 51 శాతం వాటాను జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) సొంతం చేసుకున్నందున పేరు మార్చాలని ఐడీబీఐ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది ఆర్బీఐ.
'ఎల్ఐసీ ఐడీబీఐ బ్యాంకు' లేదా 'ఎల్ఐసీ బ్యాంకు'గా పేరు మార్చాలని గత నెలలో ఐడీబీఐ బోర్డు ఆర్బీఐకు ప్రతిపాదన పంపింది. ఈ నెల 19న జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో దీనిపై చర్చించిన సభ్యులు పేరు మార్పు సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని ఐడీబీఐ బ్యాంక్‌కు తేల్చిచెప్పారు.
బ్యాంకులో 51 శాతం వాటాను ఎల్ఐసీ కొనుగోలు చేయడం వల్ల ఈ నెల మొదట్లో ఐడీబీఐ బ్యాంకును ప్రభుత్వ రంగం బ్యాంకుల పరిధి నుంచి ఆర్బీఐ తప్పించింది. ప్రైవేటు రంగ సంస్థ పరిధిలో చేరుస్తూ ప్రకటన విడుదల చేసింది.