తెలంగాణ

telangana

ETV Bharat / business

సిరి: ఈ పొదుపు సూత్రాలు పాటిస్తున్నారా?

'దీపమున్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి' అనే నానుడి వినే ఉంటారు కదా.. అదే విధంగా సంపాదించే సామర్థ్యం ఉన్నప్పుడే పొదుపు చేయడం ముఖ్యం. ఉద్యోగులకు వచ్చే నెలవారీ ఆదాయం నుంచి కొత్త మొత్తం పెట్టుబడి రూపంలో మదుపు చేయడం ద్వారా.. పదవీ విరమణ నాటికి స్థిరమైన ఆదాయం పొందొచ్చు. అందుకు అనుసరించాల్సిన మార్గాలేంటో ఇప్పటినుంచే తెలుసుకోండి.

By

Published : Jun 29, 2019, 12:57 PM IST

ఉద్యోగ యువతకు పొదుపు సూత్రాలు..

పొదుపు అనేది అన్ని వయస్సుల వారికి ముఖ్యమే.. అయితే సొంతంగా సంపాదించడం ప్రారంభించిన నాటి నుంచే పొదుపుపై దృష్టిపెడితే ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఉద్యోగంలో చేరిన వెంటనే పొదుపు ఎందుకని.. చాలా మంది అనుకుంటారు కానీ అది పొరపాటు.

సంపాదించే సామర్థ్యం ఉన్నప్పుడే పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. మరి ఉద్యోగులకు సరిపడే పొదుపు మార్గాలేంటో తెలుసుకుందాం.

ఫిక్స్​డ్ డిపాజిట్లు:

ఉద్యోగ జీవితంలో బిజీగా ఉండేవారికి.. రిస్క్​లేకుండా స్థిరమైన ఆదాయం పొందాలనుకుంటే ఫిక్స్​డ్​ డిపాజిట్లు సరిగ్గా సరిపోతాయి. సాధారణ సేవింగ్స్​ కంటే ఫిక్స్​డ్​ డిపాజిట్​లో వడ్డీ అధికంగా వస్తుంది. అయితే అత్యవసరాలకు కొంత నిధిని దాచుకుని ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయడం మంచిది. ఇలా చేస్తే ఫిక్స్​డ్ డిపాజిట్​ నుంచి మధ్యలో వెనక్కిరావడం వల్ల పెనాల్టీల నుంచి తప్పించుకోవచ్చు.

మ్యూచువ‌ల్ ఫండ్లు, ఈక్విటీ మార్కెట్లు:

కొంచెం రిస్క్ ఉన్నా సరే.. మంచి ఆదాయం రావాలనుకునేవారికి ఈ పెట్టుబడి సరిగ్గా సరిపోతుంది. ఉద్యోగులకు నెలవారీ జీతాలు వస్తాయి.. కాబట్టి ఈక్విటీ మార్కెట్లో క్రమానుగత పెట్టుబడి (సిప్​) మార్గం ఎంచుకోవడం మంచిది.

మార్కెట్లో లార్డ్​ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్​ మోస్తరుగా ఉండి.. లాభాలు అధికంగా ఉంటాయి. అత్యవసరమైతే తప్ప పెట్టుబడులను ఉపసంహరించుకోకూడదు. దీర్ఘకాలికంగా పెట్టుబడులను నిర్వహించడం ద్వారా మార్కెట్లలో ఆటుపోట్లు ఉన్నా మంచి లాభాలను పొందవచ్చు.

పసిడిపై పెట్టుబడి

ద్రవ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించే సురక్షితమైన పెట్టుబ‌డిగా బంగారాన్ని ప‌రిగ‌ణిస్తుంటారు. బంగారు ఆభ‌ర‌ణాల రూపంలో కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) లో పెట్టుబడి చేస్తే ఏడాదికి వ‌డ్డీ 2.5% ల‌భిస్తుంది. దీర్ఘ‌కాలంలో మూల‌ధ‌న వృద్ధిని కూడా పొంద‌వ‌చ్చు.

బాండ్ల కాల‌ప‌రిమితి పూర్త‌య్యాక ఉస‌సంహ‌రించిన‌ట్ట‌యితే పన్ను ఉండ‌దు. కాబట్టి, వీటిలో పెట్టుబడుల ద్వారా మూల‌ధ‌న వృద్ధి, పన్ను మిన‌హాయింపులు వంటి ప్రయోజనాలు పొందొచ్చు. వేతన పెట్టుబడిదారులు మదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. సంపాదించే మొత్తంలో కొంత బంగారంలో పెట్టుబడి చేయాలి.

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్):

పీపీఎఫ్ భ‌ద్ర‌త క‌లిగిన పెట్టుబ‌డి సాధ‌నంగా చెప్ప‌వ‌చ్చు. దీనికి లాక్ ఇన్ పీరియ‌డ్ 15 సంవ‌త్స‌రాలు ఉంటుంది. పీపీఎఫ్ లో పొదుపు చేసిన మ‌దుపు స్వ‌ల్ప‌ కాల అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌దు కానీ దీర్ఘ‌కాలంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం పీపీఎఫ్ ప‌థ‌కంలో వ‌డ్డీరేటు 8 శాతంగా ఉంది. ఇందులో పొదుపు చేసేవారికి ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద మినహాయింపులు లభిస్తాయి.

పదవీ విరమణ ప్రణాళిక కోసం ఎన్‌పీఎస్:

ఉద్యోగం ఉన్నప్పుడు ఆదాయం భారీగా ఉంటుంది. పదవీ విరమణ పొందాక కూడా నెలవారీ ఆదాయం రావాలంటే ముందస్తు ప్రణాళిక ప్రధానమైన అంశం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జాతీయ పింఛను ప‌థ‌కం( ఎన్‌పీఎస్). ఇందులో మ‌దుపు చేసేవారికి మంచి ఆదాయంతోపాటు ప‌న్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.

ABOUT THE AUTHOR

...view details