వర్షాకాలం వచ్చింది. ఏటా వర్షాకాలంలో ఇళ్లు నీట మునిగి భారీగా ఆస్థి నష్టం వాటిల్లింది అనే వార్తలు వింటూనే ఉంటాం. వాటి నుంచి కోలుకుని మళ్లీ వస్తువులన్నింటినీ కొనుక్కోవాలంటే భారీగా ఖర్చులు అవుతుంటాయి. ఈ ఏడాది వర్షాలకు ఏదైనా నష్టం జరిగితే ఖర్చులు భరించడం కాదు.. ఒక బీమా తీసుకుంటే సరిపోతుంది. అదే 'హౌస్‌హోల్డర్స్' పాలసీ. ఇంతకీ అది ఎలా పని చేస్తుందో తెలుసుకోండి.
ఇంటితోపాటు అందులో నివసించే వ్యక్తులు, ఉండే వస్తువులకు కూడా బీమా రక్షణ కల్పించటం 'హౌస్‌హోల్డర్స్' పాలసీ ప్రత్యేకత. సొంతిల్లు ఉన్న వారంతా 'హౌస్‌హోల్డర్స్' పాలసీ తీసుకోవచ్చు. గ్రామాలు, పట్టణాలన్న తేడా ఏమీ ఉండదు.
మీకు కావాల్సిన సెక్షన్ మీరే నిర్ణయించుకోండి
హౌస్‌హోల్డర్స్ పాలసీలో పది సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్ ఒక్కో రకం నష్టానికి పరిహారం ఇస్తుంది. మీ అవసరాలను బట్టి కావాల్సిన సెక్షన్లను ఎంచుకోవచ్చు.
ఉదాహరణకు.. సెక్షన్ 1ఎ ఇంటికి వర్తిస్తుంది. సెక్షన్ 1బి ఇంట్లోని వస్తువులకు వర్తిస్తుంది. ఇందులో సెక్షన్ 1బి తప్పనిసరిగా ఎంచుకుని, మిగిలినవాటిలో మీ అవసరాన్ని బట్టి కావాల్సిన సెక్షన్ ఎంచుకోవచ్చు.
వివిధ సెక్షన్ల కింద...
- ఇంటికి, ఇంట్లోని వస్తువులకు..
- దొంగలు పడి ఇల్లంతా దోచుకున్నా..
- అగ్నిప్రమాదం సంభవించి గృహోపకరణాలు ధ్వంసమైనా..
- షార్ట్ సర్క్యూట్ వల్ల టీవీ, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైనా..
- సైకిల్ అపహరణకు గురైనా (బైకుకు వాహన బీమా ఉంటుంది)..
- ప్రయాణ సమయాల్లో లగేజీని అపహరించినా పరిహారం లభిస్తుంది.
ప్రకృతి ప్రకోపాల నుంచి ఉగ్రవాదుల దాడుల వరకు కారణం ఏదైనా... బీమా అండగా నిలుస్తుంది.
ఖర్చు తక్కువే..
గృహ బీమా పాలసీకి ప్రీమియం నామమాత్రంగానే ఉంటుంది. ఇంటి వైశాల్యం, భౌగోళిక పరిస్థితులు, నిర్మాణం తీరు వంటి అంశాల ఆధారంగా ప్రీమియం ఉంటుంది.
ఇంటికీ, ఇంట్లోని వస్తువులకూ కలిపి రూ.లక్ష బీమా పాలసీ తీసుకుంటే.. ఏడాదికి ప్రీమియం రూ.50-100కు మించదు. టీవీ, ఫ్రిజ్, ఎల్‌ఈడీ టీవీ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు కలిపి రూ.లక్ష వరకూ పాలసీ తీసుకుంటే.. రూ.1,100 వరకు ప్రీమియం ఉంటుంది. అన్ని సెక్షన్లనూ కలిపి తీసుకున్నా.. రూ.లక్షకు ప్రీమియం ఖర్చు రూ.2,000 దాటదు. మీరు బీమా తీసుకోవాలనుకున్న సంస్థను బట్టి ప్రీమియం ఉంటుంది. వీటిపై జీఎస్టీ చార్జీలు అదనం.
పాలసీలో ముందు చూడాల్సిన అంశాలివే..
పాలసీ తీసుకునే ముందు అన్ని నియమ నిబంధనలను ఒకటికి రెండు సార్లు క్షుణ్నంగా పరిశీలించాలి. వీలైనన్ని ఎక్కువ వస్తువులకు బీమా వర్తించే పాలసీని ఎంచుకోవడం మేలు.