విదేశీ విరాళాల అంశంలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
విదేశాల నుంచి విరాళాలు పొందాలంటే ప్రతి ప్రభుత్వేతర సంస్థ విదేశీ నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) కింద తప్పనిసరిగా నమోదై ఉండాలి. ఎఫ్సీఆర్ఏ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలలకు ముందే సంస్థకు ఆదాయ, వ్యయాలు, రసీదులు, బ్యాలెన్స్ షీట్ తదితర వివరాలు సమర్పించాలి. ఈ సమయంలో ఎలాంటి విదేశీ నిధులు పొందకున్నా 'నిల్' రిటర్న్ సమర్పించాలి. అయితే.... ఈ వివరాలు సమర్పించనందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కు గతేడాది సంజాయిషీ నోటీసులు జారీ చేసింది కేంద్రం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.
ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కూడా ధ్రువీకరించింది. 2016లో చేసిన చట్ట సవరణ మేరకు తమ సంస్థ విదేశీ నిధుల నియంత్రణ చట్టం పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది. తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంశాఖకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రతినిధి రిషి బసు కృతజ్ఞతలు తెలిపారు.