తెలంగాణ

telangana

ETV Bharat / business

టీవీల ధరలు తగ్గనున్నాయ్​.. ఎందుకో తెలుసా? - భారీగా తగ్గింపు

దేశంలో టీవీల ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయి. టీవీ ప్యానెళ్లపై  దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయయే ఇందుకు ప్రధానకారణం. టీవీల తయారీ పరిశ్రమకు ప్రోత్సాహం అందించే దిశగా కేంద్రం ఈ ఉద్దీపన తీసుకువచ్చింది.

టీవీల ధరలు

By

Published : Sep 18, 2019, 7:11 PM IST

Updated : Oct 1, 2019, 2:32 AM IST

దేశీయంగా టీవీ పరిశ్రమలకు ఉద్దీపనలు ప్రకటించింది కేంద్రం. ఓపెన్‌ సెల్‌ టీవీ ప్యానెళ్లపై దిగుమతి సుంకాలను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో దేశీయ మార్కెట్లో ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీల ధరలు తగ్గే అవకాశాలున్నాయి.

ఓపెన్‌ సెల్‌ టీవీ ప్యానెళ్లను ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇప్పటివరకు వీటిపై 5 శాతం దిగుమతి సుంకం ఉండేది. అయితే ఈ సుంకాలను పూర్తిగా తొలగిస్తూ కేంద్ర ఆర్థికశాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటు ఫిల్మ్‌ చిప్‌లు, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్ అసెంబ్లీ(పీసీబీఏ), సెల్‌ వంటి పరికరాలపైనా దిగుమతి సుంకాలను ఎత్తివేసింది. ఈ పరికరాలను ఓపెన్‌ సెల్‌ టీవీ ప్యానెళ్ల తయారీలో ఉపయోగిస్తుంటారు.

సాధారణంగా టీవీల తయారీలో ఓపెన్‌ సెల్‌ ప్యానెల్‌ చాలా ముఖ్యమైన భాగం. టీవీల తయారీకయ్యే మొత్తం ఖర్చులో సగానికి పైగా ఈ ప్యానెల్‌కే ఖర్చవుతుంది. ఇప్పుడు వీటిపై దిగుమతి సుంకాలను తగ్గించడంతో తయారీ ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా టీవీల ధరలు కూడా దిగొచ్చే అవకాశాలున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: ఈ-సిగరెట్లపై నిషేధానికి కేంద్ర కేబినెట్​ ఆమోదం

Last Updated : Oct 1, 2019, 2:32 AM IST

ABOUT THE AUTHOR

...view details